మోదీ మీదే ఆధారపడ్డ జగన్- ఆ ఒక్క పనితో..!!
Delimitation: దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోన్న అంశం- డీలిమిటేషన్. 2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల సంఖ్య పెరగవని ఇక్కడి ప్రభుత్వాలు భావిస్తోన్నాయి.
ఏకతాటిపైకి
ఈ పరిస్థితుల మధ్య- కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా సరికొత్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు స్టాలిన్. దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికి కృషి చేస్తోన్నారు. ఇందులో భాగంగా దక్షిణాదిన బీజేపీ- మిత్రపక్షాలేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకేచోట..
జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా ఉంటోన్నందున కాంగ్రెస్ దీనికి మద్దతు ఇస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భేటీకి హాజరు అయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ కూటమితో వ్యతిరేకం కావడం వల్ల అటు భారత్ రాష్ట్ర సమితి ప్రాతినిథ్యం కూడా ఈ సమావేశంలో కనిపించింది.
కేటీఆర్ సహా..
మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇందులో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డితో కలిసి వేదికను పంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు - పినరయి విజయన్, భగవంత్ మాన్, బిజు జనతాదళ్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
ఏపీ మౌనం..
దక్షిణాదిన తెలుగుదేశం, జనసేన ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఉద్యమానికి దూరంగా ఉంటోన్నాయి. దీనికి వ్యతిరేకంగా గళమెత్తడానికి నిరాకరిస్తోన్నాయి. ఈ విషయంలో స్టాలిన్‌తో చేతులు కలపడానికి ఇష్టపడట్లేదు. జాతీయ రాజకీయాల్లో తటస్థ వైఖరిని అనుసరిస్తోన్నందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులో పాల్గొనట్లేదు.
జగన్ లేఖ..
ఈ భేటీకి హాజరు కాలేకపోయినప్పటికీ- వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన వైఖరి ఏమిటో స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. డీలిమిటేషన్ వల్ల ఆయా రాష్ట్రాల్లో రాజకీయంగా నెలకొన్న ఆందోళనల గురించి ప్రస్తావించారు. ఇదే లేఖను స్టాలిన్‌కు పంపించారు.
లెక్కలతో వివరణ..
లోక్‌సభ లేదా రాజ్యసభలో ఏ రాష్ట్రానికి కూడా ప్రాతినిధ్యం తగ్గకుండా చూసుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. 1971, 2011 నాటి జనాభా లెక్కల వివరాలను ఇందులో పొందుపరిచారు. అండమాన్ నికోబార్ సహా దక్షిణాదిన ఏ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎంత శాతం మేర జనాభా పెరిగింది? తగ్గింది అనేది వివరించారు.
సౌత్‌లో ఎక్కడ ఎంత
2011 నాటి లెక్కల ప్రకారం ఏపీలో 1971లో 5.05 శాతం మేర జనాభా ఉండగా.. 2011 నాటికి ఈ సంఖ్య క్షీణించిందని పేర్కొన్నారు. 4.08 శాతానికి తగ్గినట్లు తెలిపారు. అండమాన్ నికోబార్- 0.02 నుంచి 0.03, తెలంగాణ- 2.89 నుంచి 2.91, కర్ణాటక- 5.34 నుంచి 5.05, కేరళ- 3.89 నుంచి 2.76, తమిళనాడు- 7.52 నుంచి 5.96, పుదుచ్చేరి- 0.09 నుంచి 0.10 శాతం ఉన్నట్లు తెలిపారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్
రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 (2) (ఏ)ను ఈ సందర్భంగా మోదీకి గుర్తు చేశారు వైఎస్ జగన్. అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు సమానంగా చిన్న రాష్ట్రాలకు కూడా పార్లమెంట్‌లో సమాన ప్రాతినిథ్యాన్ని కల్పించాల్సి ఉంటుందని ఈ ఆర్టికల్ చెబుతోందని వివరించారు. ప్రతి రాష్ట్రంలోనూ సమానంగా సీట్లు పెంచేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
జోక్యం తప్పనిసరి..
దీనివల్ల- ఏ ఒక్క రాష్ట్రం కూడా పార్లమెంట్‌లో తమ ప్రాతినిథ్యాన్ని కోల్పోదని, మొత్తం లోక్‌సభ ప్రాతిపదికన తీసుకుని.. రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు ఏ మాత్రం తగ్గకుండా, పెద్ద రాష్ట్రాలకు సమానంగా వాటి సంఖ్యను పెంచాలని ప్రధాని మోదీకి జగన్ కోరారు. ఈ విషయంలో జోక్యం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications