తెలంగాణ ఆవిర్భావం: వైయస్ విగ్రహం ధ్వంసం (ఫోటో)
వరంగల్: వరంగల్‌లోని సుబేదారిలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం మధ్యాహ్నం కూల్చివేశారు. ఒక పక్క కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన 32 అడుగుల అమరవీరుల కీర్తి స్థూపాన్ని ఆవిష్కరించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో దాని పక్కనే ఉన్న వైయస్ విగ్రహాన్ని ఆగంతకులు కూల్చివేయడం కలకలం సృష్టించింది.
దివంగత వైయస్సార్ విగ్రహాన్ని రెండేళ్ల కిందట కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు. ప్రారంభం నుంచి ఈ విగ్రహం ఏర్పాటు వివాదాలను ఎదురుకుంటోంది. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగిన తరుణంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారనే కారణంగా పలుమార్లు ఈ వైయస్ విగ్రహాన్ని కూల్చివేసేందుకు ఉద్యమకారులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఒక దశలో విగ్రహం చుట్టు ఇనుప ముళ్లకంచె కూడా ఏర్పాటు చేశారు. గత నవంబర్‌లో తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళనలు జరిగిన సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు వైయస్ విగ్రహం తలకు నిప్పుపెట్టడంతో పాటు చేతిని విరగొట్టారు. ఈ ఘటనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు.
అప్పటి నుంచి వైయస్ విగ్రహానికి బట్ట కట్టారు. ఈ విగ్రహానికి పక్కనే గత పది రోజుల నుంచి తెలంగాణ అమరవీరుల కీర్తి స్థూప నిర్మాణం ప్రారంభించి ఆదివారం మధ్యాహ్ననికి పూర్తి చేశారు. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ఆదివారం అర్థరాత్రి కీర్తి స్థూపాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ తరుణంలో ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని కొందరు వ్యక్తులు వైయస్ విగ్రహానికి తాడు కట్టి బలంగా లాగడంతో విగ్రహం పక్కకు ఒరిగిపోయింది. విగ్రహానికి చుట్టిన గుడ్డకు నిప్పు పెట్టడంతో విగ్రహం పాక్షికంగా కాలింది.












Click it and Unblock the Notifications