రాజీనామాకు సిద్దమైన విజయమ్మ..!! వైసీపీలో సంచలనం - సీఎం ఏం కోరారు..!!
వైసీపీ పదవికి విజయమ్మ రాజీనామా చేయబోతున్నారా. అందుకు సీఎం జగన్ వద్ద ప్రతిపాదించారా. సీఎం ఏం చెప్పారు. ఇప్పుడు వైసీపీలో ఈ విషయం కలకలం రేపుతోంది. వైసీపీకి సీఎం జగన్ తల్లి విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో విజయమ్మ పార్టీ పదవికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లుగా ప్రచారం సాగుతోంది. చెల్లి షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు ను జగన్ వ్యతిరేకించారు. పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం వద్దంటూ.. షర్మిల పార్టీ ప్రతిపాదనను జగన్ వ్యతిరేకించారు. కానీ, షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసారు. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు.
Recommended Video


కుమార్తెతోనే ఎక్కువగా విజయమ్మ
సోదరి షర్మిలతో జగన్ కు భిన్నాభిప్రాయాలే కానీ, బేదాభిప్రాయాలు లేవని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అయితే.. తల్లి విజయమ్మ మాత్రం ఎక్కువగా కుమార్తె షర్మిలతో ఉంటున్నారు. షర్మిల పాదయాత్ర లోనూ అక్కడక్కడా సభల్లో పాల్గొంటున్నారు.
సీఎం జగన్ తో కలిసి తల్లి విజయమ్మ పులివెందులలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొన్నారు. విజయవాడలో నిర్వహించిన వైఎస్సార్ పురస్కారాల ప్రధాన సభకు హాజరయ్యారు. అయితే, పార్టీ ఏర్పాటు సమయంలోనే జగన్ తన తల్లి విజయమ్మను పార్టీ గౌరవాధ్యక్షురాలిగా రిజిస్ట్రేషన్ చేసారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే హోదాలో కొనసాగుతున్నారు.

గౌరవాధ్యక్షురాలి పదవికి దూరం కావాలని
అయితే, కుమార్తె షర్మిల వైఎస్సార్టీపీ ఏర్పాటు చేయటం... ఆ కార్యక్రమాల్లో అప్పడప్పుడూ పాల్గొనుతున్న సమయంలో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగటం సరి కాదనే అభిప్రాయంతో ఉన్నట్లుగా సమాచారం. ఇదే విషయాన్ని విజయమ్మ తన కుమారుడు జగన్ వద్ద ప్రస్తావించి.. రాజీనామాకు సిద్దమయ్యారని తెలుస్తోంది.
అయితే, జూలై 8న జరిగే వైసీపీ ప్లీనరీ వరకూ కొనసాగాలని జగన్ కోరినట్లుగా సమాచారం. కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో షర్మిల సైతం ఇదే అంశం పైన స్పందించారు. వైఎస్సార్టీపి కార్యక్రమాల్లో విజయమ్మ కనిపిస్తున్నారని..వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉంటూ పాల్గొనటం పైన సమాధానం ఇస్తూ..తన తల్లిగా తనతో పాటుగా విజయమ్మ పాల్గొంటున్నారని సమాధానమిచ్చారు.

సీఎం జగన్ అంగీకరిస్తారా...వారిస్తారా
అయితే, ఇప్పుడు విజయమ్మ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తే..వైసీపీలో సంచలనం అయ్యే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ ఏర్పాటు..తరువాత జగన్ జైలులో ఉన్న సమయంలోనూ... 2014, 2019 ఎన్నికల్లోనూ విజయమ్మ వైసీపీ అభ్యర్ధుల విజయం కోసం ప్రచారం చేసారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటించారు. జగన్ అధికారంలోకి వచ్చే వరకూ తోడుగా నిలిచారు. జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక, ఇప్పుడు విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తారా..లేక, అటువంటి నిర్ణయం తీసుకోకుండా జగన్ వారిస్తారా అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications