IND vs ENG: తిలక్, వరుణ్ అవుట్-సంజూ ఇన్..! నాలుగో టీ20కి తుది జట్టు..!
ఇంగ్లండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్పణం తర్వాత రెండు, మూడు మ్యాచ్ ల్ని అప్పనంగా ఆతిధ్య జట్టుకు సమర్పించుకున్న టీమిండియా ఇప్పుడు గురువారం బ్రిస్టల్ లో జరిగే నాలుగో టీ20 మ్యాచ్ (IND vs ENG 4th T20)లో ఆడేందుకు సిద్దమవుతోంది. ఈ మ్యాచ్ లో ఓడితే సిరీస్ కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జట్టు ఎంపికలో భారీ మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే ఐర్లాండ్ సిరీస్ తో కలిపితే వరుసగా ఐదు మ్యాచ్ ల్లో భారత్ గెలవకుండానే ముగించింది. దీంతో ఈ మ్యాచ్ టీమిండియాకు చావోరేవో అన్నట్లుగా మారింది. ఈ నేపథ్యంలో తుది జట్టు ఎంపికలో మార్పులు చేస్తున్నారు.
ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో వరుసగా విఫలమవుతున్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ తిలక్ వర్మ స్ధానంలో సంజూ శ్యాంసన్ ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని మేనేజ్ మెంట్ నిర్ణయించింది. అయితే ఓపెనింగ్ స్ధానాల్లో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీని కొనసాగించే అవకాశం ఉంది. దీంతో సంజూ శ్యాంసన్ ను వన్ డౌన్ లో బ్యాటింగ్ కు పంపబోతున్నారు. ఇషాన్ కిషన్ సెకండ్ డౌన్ లో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే వస్తారు.

అలాగే బౌలింగ్ విభాగంలోనూ మార్పులు చేయబోతున్నారు. ఇంగ్లండ్ తో మూడు మ్యాచ్ ల్లో కేవలం ఒకే ఒక్క వికెట్ తీసిన వెటరన్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఈసారి పెవిలియన్ కు పరిమితం చేయబోతున్నారు. అతని స్ధానంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ను తీసుకోబోతున్నారు. సుందర్ బ్యాటింగ్ కు కూడా పనికొస్తాడని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. పేసర్లు అర్ష్ దీప్, హర్షిత్ రాణా ప్రదర్శన కూడా అంతంతమాత్రంగానే ఉన్నా ప్రస్తుతానికి వారిని కొనసాగించబోతున్నారు. కొత్త కుర్రాడు ప్రిన్స్ యాదవ్ రాణిస్తుండటం టీమ్ కు సానుకూలంగా కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications