వైఎస్ వివేకా హత్యకేసు : జగన్ పై లోకేష్ సెటైర్లు .. కుక్కల మాదిరిగా మొరుగుతారా అన్న కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీమంత్రి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఆయన కుమార్తె సునీత రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరోమారు వివేకా హత్య కేసు తెరమీదికి వచ్చింది. ఇక అధికార పార్టీని, సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు వైయస్ వివేకా హత్య కేసుని ఇప్పటివరకు తేలేదని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే సమయంలో వైఎస్ వివేకా హత్య వెనుక వైసీపీ నేతలే ఉన్నారంటూ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ జగన్ ను టార్గెట్ చేస్తున్నారు టిడిపి నేతలు. ఇక టీడీపీ నేతలకు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ మంత్రులు .

బాబాయ్ ని ఎవరు చంపారు చెప్పు అబ్బాయి అంటూ సెటైర్లు
తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ ని టార్గెట్ చేశారు. అంతా అడిగినట్టే తాను కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి అడుగుతున్నాను జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు . బాబాయ్ ని ఎవరు చంపారు చెప్పు అబ్బాయి అంటూ సెటైర్లు వేశారు. మీ చిన్నాయనని మా నాయన నరికేశాడు అన్నావు . సిబిఐ దర్యాప్తు చేయాలన్నావు . ఇప్పుడు ఎందుకు సీబీఐ దర్యాప్తు వద్దంటున్నావు సమాధానం చెప్పు సైకో రెడ్డి అంటూ తీవ్ర విమర్శలు చేశారు .

ఢిల్లీని గడగడలాడిస్తానన్న అని చెప్పిన జగన్ రెడ్డి గజగజా వణికిపోతున్నాడు
వివేకా హత్య కేసు విచారణకు సీబీఐ అధికారులు వస్తే చాలు ఢిల్లీని గడగడలాడిస్తానన్న అని చెప్పిన జగన్ రెడ్డి గజగజా వణికి పోతున్నాడు అంటూ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై లోకేష్ సీఎం జగన్ ను ప్రశ్నించారు. ఇక వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై టిడిపి నేతలు చేస్తున్న విమర్శలకు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడటం పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు.

జగన్మోహన్ రెడ్డి ఏనుగు లాంటి వారని ప్రతిపక్షాలు కుక్కల మాదిరిగా మొరిగితే పట్టించుకోరు
ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశాడు. వివేకా కుమార్తె విజ్ఞప్తి మేరకు ఈ కేసును సీబీఐ విచారణ జరుగుతుందని, ప్రతిపక్షాలు కోడిగుడ్డుపై ఈకలు పీకే మాదిరిగా వ్యవహరిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏనుగు లాంటి వారిని ప్రతిపక్షాల కుక్కల మాదిరిగా మొరిగితే పట్టించుకోరని అన్నారు. వివేకా హత్య జరిగిన కాలంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అసహనం వ్యక్తం చేశారు.

వైఎస్ వివేకా హత్యపై అనవసర రాద్ధాంతం మంచిది కాదు
దోషులను పట్టుకోవడంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు రాష్ట్రప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పిన కొడాలి నాని ఎయిర్ పోర్ట్ లో జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిలో టిడిపి వ్యక్తుల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయని, ఇక దానిని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోందని, కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తులో ఉన్న వాటిపై అనవసర రాద్ధాంతం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా టిడిపి నేతలు తమ పద్ధతి మార్చుకోవాలని కొడాలి నాని హితవు పలికారు.












Click it and Unblock the Notifications