టీడీపీ అభ్యర్ధిగా వివేకా కుమార్తె సునీత - చంద్రబాబు నయా స్కెచ్..!?
ఏపీలో ఎన్నికల దిశగా రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ వై నా్ 175 నినాదంతో ముందుకు వెళ్తోంది. వై నాట్ పులివెందుల అంటూ చంద్రబాబు కొత్త స్లోగన్ మొదలు పెట్టారు. ఇదే సమయంలో కడప జిల్లా పైన చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. వైసీపీ నేతలు ఈ సారి కుప్పంలోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో కడప జిల్లాలో చంద్రబాబు కొత్త గేమ్ ప్రారంభించారు. వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ..కడపలో జగన్ ను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహం అమలు చేయాలని భావిస్తున్నారు. ఆ దిశగా కొత్త స్కెచ్ సిద్దం చేస్తున్నారు.

కడప బరిలో వైఎస్ సునీత: ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి కడప కంచుకోట. 2019 ఎన్నికల్లో జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వచ్చే ఎన్నికల్లోనూ అదే రిపీట్ చేయటానికి ప్రయత్నిస్తోంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం పులివెందుల కు చెందిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే రకంగా వైసీపీ పైన ఒత్తిడి పెంచాలనేది చంద్రబాబు వ్యూహం.
అందులో భాగంగా జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలతో పాటుగా ఎంపీ సీటు పైన అభ్యర్దుల ఎంపిక పైన కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో పర్యటించారు. ముఖ్య నేతలతో సమీక్ష చేసారు.వైఎస్ వివేకా హత్య కేసు లో ముఖ్యమంత్రిని కార్నర్ చేసేలా రాజకీయ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా సునీతను పార్టీ నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నారు.
కడప ఎంపీగా పోటీ: జిల్లాలో పార్టీలో చేరికలు, స్థానాల కేటాయింపు పైన సర్వే సంస్థల నివేదికల ఆధారంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ వివేకా హత్య కేసులో చోటు చేసుకుంటున్న పరిణామాలతో వైసీపీ కడప నేతలు ఆత్మరక్షణలో పడ్డారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలోనే వైఎస్ వివేకా కుమార్తు సునీత గురించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. సునీత పోరాటాన్ని అభినందించారు.
సునీతకు అండగా నిలవాల్సిన అవసరం ఉందంటూ తన ఉద్దేశం స్పష్టం చేసారు. టీడీపీ అభ్యర్ధిగా వచ్చే ఎన్నికల్లో సునీతను కడప ఎంపీగా బరిలోకి దించాలనేది చంద్రబాబు వ్యూహంగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా చంద్రబాబు - వైఎస్ సునీత మధ్య చర్చలు కూడా జరిగానేది వైసీపీ నేతలు చెబుతున్న మాట. ఇదే సమయంలో అవినాష్ సైతం సునీత - చంద్రబాబుతో చేతులు కలిపారని తాజాగా వివేకా కేసు విచారణ సమయంలో ఆరోపించారు.
సునీత సుముఖంగా ఉన్నారా: వైఎస్ సునీత ప్రముఖ ఆస్పత్రిలో వైద్యురాలిగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయంగా టీడీపీ నుంచి బరిలోకి దిగేందుకు సునీత సుముఖంగా ఉన్నారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. జగన్ పార్టీకి వ్యతిరేకంగా సునీత టీడీపీ నుంచి బరిలోకి దిగితే రాజకీయంగా సమీకరణాలు మారనున్నాయి.
సునీతను ఒప్పించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. సునీత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని..ఇప్పుడు టీడీపీలో చేరితే వైసీపీ నేతలు వివేకా హత్య కేసులో చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో, ఇప్పుడు టీడీపీ నేతల ప్రతిపాదనతో సునీత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications