బిల్లుపై జగన్ పార్టీ స్పీకర్‌కు లేఖ: సిఎంకు ఖాళీ పత్రాలు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుకు ఏ విధమైన సవరణలు ప్రతిపాదించరాదని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకుంది. దీంతో తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాసింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నప్పుడు సవరణలు ప్రతిపాదిస్తే విభజనను ఆమోదించినట్లవుతుందని ఆ పార్టీ భావిస్తోంది.
ఇదిలావుంటే, కాంగ్రెసు సీమాంధ్ర శానససభ్యులు సంతకాలు చేసిన ఖాళీ పత్రాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అందజేశారు. తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తూ వాటిని భర్తీ చేయాలని వారు కోరారు. ఏ విధమైన సవరణలు ప్రతిపాదించాలో ముఖ్యమంత్రికి తెలుసునని, అందుకే ఖాళీ పత్రాలు అందజేశామని కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యులు అన్నారు.

కాగా, తెలంగాణ ముసాయిదా బిల్లులోని 108 క్లాజులకు సవరణలు ప్రతిపాదించాలని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు నిర్ణయించారు. మొత్తం 4,928 సవరణలు ప్రతిపాదిస్తూ సీమాంధ్ర తెలుగుదేశం శాసనసభ్యులు స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. ఎవరికి వారే విడివిడిగా నోటీసులు ఇచ్చారు. 44 మంది శాసనసభ్యులు ఆ మేరకు నోటీసులను విడివిడిగా ఇచ్చారు. రాష్ట్ర సమగ్రతను దెబ్బ తీసే విధంగా అనేక క్లాజులు ఉన్నాయని వారన్నారు. ప్రతి క్లాజును తాము వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభను అడ్డుకోవడం సరి కాదని తెలుగుదేశం సీమాంధ్ర ప్రాంత శాసనసభ్యుడు దూళిపాళ్లి నరేంద్ర చౌదరి అన్నారు. రాష్ట్ర ప్రగతికి కారకులు ఎవరో రేపటి ఎన్నికల్లో ప్రజలు తేల్చుకుంటారని ఆయన అన్నారు. సమైక్యవాదులంతా ఒక్కటిగానే ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. సీమాంధ్ర శాసనసభ్యులంతా పార్టీలకు అతీతంగా ఉద్యమించి తెలంగాణ ముసాయిదా బిల్లును ఓడించాలని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజల అభీష్టం మేరకు చర్చలో పాల్గొనాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications