బాబు కారణాలు చెప్తున్నారని జగన్, చిరు జోరు పెంచినా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఓటమికి కారణాలు వెతుక్కోవడానికే.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రౌడీయిజానికి పాల్పడిందని, ఎన్నికల సంఘం తీరు సరిగా లేదని విమర్శలు గుప్పిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 140కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని జగన్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో టిడిపి కూడా తాము 120 స్థానాలకు పైగా గెలుస్తామని చెబుతోంది.
పోలింగ్ సమయంలో సీమాంధ్రలు పలు ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీనిపై టిడిపి తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఫ్యాక్షన్ సంసృతిని సీమాంధ్ర వ్యాప్తం చేయాలని చూసిందని, ఆ పార్టీ వాళ్లు తమ వారి పైన దాడులకు పాల్పడ్డారని టిడిపి విమర్శలు గుప్పిస్తోంది. ఇంత జరుగుతున్నా ఈసి ఏం చేస్తోందని టిడిపి ప్రశ్నించింది.

దీనిపై జగన్ పార్టీ కూడా ధీటుగానే స్పందిస్తోంది. టిడిపి గెలుస్తామని చెబుతున్నప్పటికీ ఓడిపోతుందని, ఇప్పుడే తమ ఓటమికి కారణాలను వెతుక్కుంటోందని వారు ఎద్దేవా చేస్తున్నారు. 2009లో పోలింగ్ జరిగిన తర్వాత చంద్రబాబు తమ మహా కూటమి 200 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారని, తీరా ఆ కూటమి గెలుచుకుంది 107 సీట్లు మాత్రమేనని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందంటున్నారు.
2009లో వైయస్ రాజశేఖర రెడ్డి పైన చంద్రబాబు నిప్పులు చెరిగారని చెబుతున్నారు. వైయస్ డేంజర్ లీడర్ అని, అతను చివరికి తన నియోజకవర్గంలో కూడా రౌడీలను దించి డబ్బు, మద్యం పంపిణీ చేయించారని చంద్రబాబు అన్నారని, ఆ తర్వాత ఫలితాలు చూస్తే వైయస్‌కు ప్రజలు పట్టం కట్టారని, ఇప్పుడు కూడా ఓటమి బాటలో ఉన్న చంద్రబాబు... జగన్ పైన మండిపడుతున్నారని, ఇప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని అంటున్నారు.
చిరు జోరుగా పర్యటించినా...
మరోవైపు, సీమాంధ్రలో గెలుపు పైన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య పోటా పోటీ నెలకొని ఉండగా.. కాంగ్రెసు పార్టీలో మాత్రం ఎలాంటి అలికిడి కనిపించడం లేదు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీని గట్టెక్కించేందుకు ఆ పార్టీ నేత, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి జోరుగా పర్యటించారు. అయినప్పటికీ కాంగ్రెసు పార్టీ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications