పడగ విప్పిన ఫాక్షన్: జగన్ పార్టీ నేత దారుణ హత్య
కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఫాక్షన్ మళ్లీ పడగ విప్పింది. పెద్ద చింతకుంట్లకి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఇంజేటి రాఘవరెడ్డిపై ప్రత్యర్ధులు బుధవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో రాఘవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రాఘవరెడ్డి మృతిచెందారు.
మూడేళ్ల క్రితం గ్రామంలో జరిగిన ఇంజేటి కృష్ణారెడ్డి కుటుంబం హత్య కేసులో రాఘవరెడ్డి ప్రధాన నిందితుడు. ఇంజేటి రాఘవరెడ్డి ఇద్దరు అనుచరులు, డ్రైవర్‌తో కలిసి ఇన్నోవా వాహనంలో ఆళ్లగడ్డ నుండి స్వగ్రామమైన పెద్ద చింతకుంట్లకు వెళ్తుండగా దాల్‌మిల్ సమీపంలో టిప్పర్‌లో వచ్చిన ప్రత్యర్ధులు దాడి చేశారు. ఇన్నోవా వాహనాన్ని టిప్పర్‌తో ఢీ కొట్టారు.

వాహనంలో ఉన్నవారు తేరుకునేలోపే ప్రత్యర్థులు వారి కళ్లలో కారం కొట్టారు. రాఘవరెడ్డిపై వేటకొడవలి, రాడ్‌తో దాడి చేశారు. రాఘవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే సిఐ ఓబులేసు, ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి సంఘటనా స్ధలానికి చేరుకున్నారు.
గాయపడిన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం రాఘవరెడ్డిని మెరుగైన చికిత్స కోసం కర్నూలులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆయన మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.












Click it and Unblock the Notifications