మేం రాము: జగన్ పార్టీ, మేమే కలుస్తాం: అశోక్ బాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజనను స్పష్టంగా, ఎలాంటి అనుమానాలకూ తావు లేకుండా మొదటి నుండి తమ పార్టీ వ్యతిరేకిస్తోందని, తమకు ఒక విధానం ఉందని, ఈ నెల 21వ నిర్వహించ తలపెట్టిన ఎపిఎన్జీవో సభకు తాము హాజరు కావడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుకు లేఖ రాసింది. పార్టీ సిజిసి మెంబర్ మైసూరా రెడ్డి పేరుతో ఈ లేఖను అశోక్ బాబుకు విడుదల చేసింది.
ఈ నెల 21న అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానం పలుకుతూ తమకు 18న లేఖ వచ్చిందని, అందుకు ధన్యావాదాలు అన్నారు. రాష్ట్రంలో 70 నుండి 75 శాతం ప్రజల ఆకాంక్ష సమైక్యాంధ్ర అని, ఈ ప్రజల వాణిని దేశవ్యాప్తంగా ప్రధాన రాజకీయ పక్షాలకు వినిపించడంలో, పార్లమెంటుకు సైతం మద్దతు కూడగట్టడంలో తమ పాత్ర ప్రజలకు తెలుసునన్నారు.

రాష్ట్ర విభజనకు ఈ చెడిపోయిన రాజకీయాలు.. ఓట్లు, సీట్ల ప్రాతిపదికలు కారణమని అన్ని ప్రాంతాల ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. విలువరు, విశ్వసనీయత కలిగిన రాజకీయాలను అనుసరించే పార్టీగా తమ పార్టీ రెండు పడవల మీద ప్రయాణం చేయడాన్ని వ్యతిరేకిస్తోందన్నారు.
ఈ విభజన బిల్లు మీద చర్చ జరుగుతున్న అసెంబ్లీలో, పార్లమెంటులో ప్రాంతాల వారీగా సభ్యులను ఎగదోస్తున్న రాజకీయ పక్షాలు, ప్రధానంగా తెలుగుదేశం, కాంగ్రెసులు మన కళ్ల ఎదుటే ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో సమైక్యవాదానికి మనసా, వాచా కర్మణా కట్టుబడని పార్టీలతో విభజనకు తీర్మానాలు చేసి లేఖలు ఇచ్చి వెనక్కి తీసుకోబోం అంటున్న పార్టీలతో తాము వేదికలు పంచుకునేందుకు సిద్ధంగా లేమన్నారు.

సమైక్యవాదానికి కట్టుబడిన పార్టీలను మాత్రమే ఆహ్వానిస్తే మేం రావడానికి సిద్ధమని, అలాంటి సమావేశంలో తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పాల్గొంటారన్నారు. సమైక్య ప్రకటన చేయని పార్టీలపై ఎపిఎన్జీవోలు ఒత్తిడి తీసుకు రావాలన్నారు.
మేమే వెళ్తాం: అశోక్ బాబు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ వద్దకు రాకుంటే తామే వెళ్లి కలుస్తామని అశోక్ బాబు ఈ సందర్భంగా అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఇది ఆఖరి పోరాటమన్నారు. రాజకీయ పార్టీలు సమైక్యవాదాన్ని పక్కన పెట్టి ఉద్యమానికి మద్దతివ్వాలని కోరారు. రేపు అసెంబ్లీలో పార్టీలు ఏం అభిప్రాయం చెబుతాయో చూస్తామన్నారు. కేంద్రంపై ఎంపీల అవిశ్వాసం చారిత్రాత్మకమన్నారు. తెలంగాణ ఉద్యోగులు, రాజకీయ నాయకుల్లా ఇక్కడ మేం ఏకమవుతామన్నారు. రాజకీయ పార్టీలు పొలిటికల్ జెఏసి ఏర్పాటు చేస్తే మద్దతిస్తామన్నారు.
పయ్యావుల సవాల్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి టిడిపి నేత పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు. జగన్ సమైక్యవాది అయితే రేపటి ఎపిఎన్జీవోల సదస్సులో పాల్గొనాలన్నారు. జగన్ వేసే ప్రతి అడుగులో అస్పష్టత ఉందన్నారు. పయ్యావుల ఎపిఎన్జీవో హోంకు వచ్చి ఉద్యోగులను కలిశారు.












Click it and Unblock the Notifications