వారి ఓట్లు పడలేదని వైసీపీకి అర్థమైందా?
ఢీ అంటే ఢీ అన్నట్లుగా అల్లర్లు, గొడవలు, దాడుల మధ్య జరిగిన ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. వచ్చేనెల నాలుగోతేదీన ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈలోగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ఎవరికి వారుగా ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ నియోజకవర్గాల్లో గెలుపొందే అవకాశం ఉంది? ప్రత్యర్థి పార్టీకి ఎక్కడ ప్లస్ లు ఉన్నాయి? ఎక్కడ మైనస్ లు ఉన్నాయి? తమకు ప్లస్ లు, మైనస్ లు ఎక్కడ? అనే అంచనాల్లో మునిగిపోయాయి. ఏ పార్టీకాపార్టీ తమ శ్రేణులకు తామే అధికారంలోకి వస్తామని చెబుతూ వారిలో ఆత్మవిశ్వాసం సడలకుండా చూసుకుంటున్నాయి.
ఎవరెవరు అండగా నిలిచారంటే..
ఏయే వర్గాలు ఏ పార్టీకి అండగా నిలిచారు అన్న అంశంపై అన్ని పార్టీలు ఓ అవగాహనకు వస్తున్నాయి. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకు పడలేదన్న అంచనాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. పోస్టల్ బ్యాలెట్లలో ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వంపై ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగులు పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా తమను వేధింపులకు గురిచేసిందనే అభిప్రాయంలో వారంతా ఉన్నారు. దీంతో సహజంగానే వీరంతా ప్రతిపక్షానికి ఓటు వేసివుంటారని వైసీపీ అంచనాకు వచ్చింది.

చెల్లుతాయని ప్రకటించిన ఈసీ
ఈ ఓట్లు చీలిపోతే తమకు కొంత లాభం కలుగుతుందనే ఉద్దేశంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూల్స్ వెతుకుతోందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకు సంబంధించి కొన్ని కొన్ని ప్రాంతాల్లో రిటర్నింగ్ అధికారులు తమ సీల్ వేయలేదు. దీంతో ఇవి చెల్లుతాయా? చెల్లవా? అనే ఆందోళనలో ఉద్యోగులున్నారు. దీనిపై ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. సీల్ లేని కారణంగా ఓట్లు మురిగిపోకూడదన్న ఉద్దేశంతో ఉన్న ఈసీ అవి చెల్లుతాయని ప్రకటించింది. అయితే అలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ వైసీపీ ఈసీని ప్రశ్నించింది. కచ్చితంగా రిటర్నింగ్ అధికారి ముద్ర ఉండాలని, సంతకం ఉండాలని, లేదంటే వాటిని చెల్లని ఓట్లుగా పరిగణించాలని ఈసీపై ఒత్తిడి తెస్తోంది.












Click it and Unblock the Notifications