'మా తప్పుల వల్లే చంద్రబాబు సీఎం అయ్యారు': జగన్‌కు చురక
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన చిన్న చిన్న తప్పిదాలే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డాయని ఆ పార్టీ సీనియర్ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. అయితే వైసీపీ చేసిన ఆ తప్పిదాలు ఏంటో చెప్పేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.
వైసీపీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు ఆనం విజయకుమార్‌రెడ్డి, ఆయన కుమారుడు కార్తికేయరెడ్డి, వారి అనుచరులు బుధవారం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి మాట్లాడారు. 2014 సాధారణ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సి ఉన్నప్పటికీ, పార్టీ చేసిన చిన్న తప్పిదాలు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేశాయని తెలిపారు.
ఇది మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. 2019 ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి యాసిడ్ టెస్ట్ లాంటివి చెప్పుకొచ్చిన ఆయన జగన్ ఒక్క తప్పు కూడా చేయకూడదని కోరుకుంటున్నానని సభా ముఖంగా చెప్పారు. ఈ సందర్భంగా వైయస్ జగన్‌కు చురక అంటించారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడానికి చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారని అన్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు పేరు ప్రజల్లో దిగజారుతోందని, దానిని వైయస్ జగన్ సరిగ్గా వినియోగించుకుని అధికారంలోకి రావాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తప్పులు మీద తప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఉదాహరణకు హైదరాబాద్‌లో 'ఓటుకు నోటు కేసు', నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటూ ప్రస్తావించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం పట్ల వ్యవహరిస్తున్న తీరు సైతం సరిగా లేదని ఆయన దుయ్యబట్టారు. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.
కస్తూరిదేవి గార్డెన్స్‌లో బుధవారం జరిగిన సభలో ఆనం విజయకుమార్ రెడ్డి, ఆయన తనయుడు కార్తికేయరెడ్డికి పార్టీ కండువాలు వేసి జగన్ వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాని గోవర్థన్, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications