వైనాట్ 175 కోసం వైసీపీ గేమ్ ప్లాన్
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లింది. ఇంకో అయిదారు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కొనడానికి కసరత్తు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీ క్యాడర్‌తో పలుదఫాలుగా సమావేశం అయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్నీ నిర్వహించారు. దీని ద్వారా ఎమ్మెల్యేలను ప్రతి ఇంటికీ పంపించారు. సంక్షేమ పథకాల అమలు తీరు, పార్టీ నాయకులపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలను నేరుగా వారి నుంచే తీసుకోవడానికి ఉపయోగపడిందీ ప్రోగ్రామ్. స్థానికంగా ఎంత వరకు బలంగా ఉన్నామనే విషయాన్ని బేరీజు వేసుకోవడానికి వీలు కల్పించింది.

ఇక- బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్సీపీ. దీనికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాలు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఒకేసారి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మూడు నెలల పాటు కొనసాగుతుంది. దీనికి సామాజిక సాధికార యాత్ర అని పేరు పెట్టింది.
ఈ నెల 26వ తేదీన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా- ఇచ్చాపురం, కోస్తాంధ్రలో గుంటూరు జిల్లా- తెనాలి, రాయలసీమలో అనంతపురం జిల్లా- శింగనమల నియోజకవర్గాల్లో ఒకేసారి ప్రారంభమౌతాయి. కాబోతున్నాయి. ఆయా ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొంటారు. ప్రజలను మరోసారి ముఖాముఖిగా కలుసుకుంటారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తారు.
27వ తేదీన గజపతినగరం, 28వ తేదీన భీమిలి, 30న పాడేరు, 31న ఆముదాలవలస, నవంబర్ 1న పార్వతీపురం, 2న మాడుగుల, 3న నరసన్నపేట, 4వ తేదీన శృంగవరపుకోట, 6వ తేదీన గాజువాక, 7న రాజాం, 8న సాలూరు, 9వ తేదీన అనకాపల్లి నియోజకవర్గాల్లో బస్సుయాత్ర జరుగుతుంది.
కోస్తాంధ్రలో 27వ తేదీన నరసాపురం, 28న చీరాల, 30న దెందులూరు, 31న నందిగామ, నవంబరు 1వ తేదీన కొత్తపేట, 2న అవనిగడ్డ, 3న కాకినాడ రూరల్, 4న గుంటూరు తూర్పు, 6న రాజమండ్రి రూరల్, 7న వినుకొండ, 8న పాలకొల్లు, 9న పామర్రు నియోజకవర్గాల్లో కొనసాగుతుంది.
రాయలసీమలో 27వ తేదీన తిరుపతి, 28న ప్రొద్దుటూరు, 30న ఉదయగిరి, 31న ఆదోని, నవంబర్ 1న కనిగిరి, 2న చిత్తూరు, 3వ తేదీన శ్రీకాళహస్తి, 4వ తేదీన ధర్మవరం, 6న మార్కాపురం, 7వ తేదీన ఆళ్లగడ్డ, 8న నెల్లూరు రూరల్, 9వ తేదీన తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోయాత్ర కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications