టీడీపీ, వైసీపీలో మారుతున్న సామాజిక లెక్కలు - కలిసొచ్చేదెవరికి...!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఈ సారి ఎన్నికల్లో సామాజిక లెక్కలు కీలకంగా మారుతున్నాయి. అభ్యర్దుల ఎంపికలో ముఖ్యమంత్రి సామాజిక లెక్కలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సమయంలోనే అనూహ్యంగా టీడీపీకి మద్దతుగా నిలిచే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీ బాట పడుతున్నారు. అటు వైసీపీకి మద్దతుగా నిలుస్తుందని చెప్పుకొనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు టీడీపీ వైపు ఆసక్తి చూపిస్తుండటం కొత్త సమీకరణాలకు కారణమవుతోంది.
మారుతున్న లెక్కలు : ఏపీలో ఎన్నికల లెక్కలు మారుతున్నాయి. టీడీపీకి తొలి నుంచి కమ్మ సామాజిక వర్గం అండగా నిలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం మెజార్టీ ఉన్న నియోజకవర్గాల్లో తొలి నుంచి టీడీపీకి అనుకూల ఫలితాలు వస్తున్నాయి. 2019లో మాత్రం కొంత పరిస్థితులలో మార్పు కనిపించింది. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూలగా ఫలితాలు వచ్చాయి. ఇక, వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పార్టీల్లో జంపింగ్స్ మొదలయ్యాయి. క్రిష్ణా జిల్లాలో గతంలో టీడీపీలో పని చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ వైసీపీలో ఉన్నారు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరటానికి నిర్ణయించారు. దేవినేని నెహ్రూ వారసుడు అవినాశ్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దిగా పోటీ చేయనున్నారు. ఇక, గుంటూరు జిల్లాలోనూ ఇదే సామాజిక వర్గానికి చెందిన నేతలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఎవరు ఎటువైపు : ఇదే సమయంలో టీడీపీ రెడ్డి సామాజిక వర్గ నేతలను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రాదాన్యత ఇస్తోంది. నెల్లూరు జిల్లాలో ఆనం, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకుంది. వైసీపీ వీరి పైన వేటు వేసింది. ఇక, వచ్చే ఎన్నికలకు ముందు ఇదే వర్గానికి చెందిన నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఒక ఎంపీ, మాజీ మంత్రి, మరో ఎమ్మెల్యేతోనూ టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీలో సీట్ల వ్యవహారం ఫైనల్ అయిన తరువాత సీట్లు దక్కకపోతే వీరు సైకిల్ ఎక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మెజార్టీ నేతలు జనసేన వైపు చూస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తు కారణంగా రెండు పార్టీల్లో ఈ రెండు వర్గాలకే ప్రాధాన్యత కనిపిస్తోందనే అభిప్రాయం ఉంది.

కలిసొచ్చేదెవరికి : దీంతో, ఈ సారి మూడు పార్టీలు ఎన్నికల రేసులో ఉండటం..ప్రధానంగా ఈ మూడు వర్గాలకు చెందిన నేతల మద్దతు చర్చకు కారణమవుతోంది. ఇదే సమయంలో జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటింగ్ తన వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ తమ పార్టీ తొలి నుంచి బీసీలకు అనుకూలంగా ఉందని చెబుతోంది. బీసీ ఓట్ బ్యాంక్ కీలకంగా మారటంతో మెజార్టీ మద్దతు ఎవరికి దక్కుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. 2019 లో జగన్ అమలు చేసిన సామాజిక సమీకరణాలే 2019 ఎన్నికల్లో జగన్ కు 151 సీట్లు రావటంతో కీలక పాత్ర పోషించాయి. దీంతో, ఇప్పుడు మారుతున్న ఈ సమీకరణాలు ఎన్నికల్లో ఎవరికి కలిసి వస్తాయి..ఎవరికి పట్టం కడతాయనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications