తిరుపతి వైసీపీ అభ్యర్ది ప్రకటన - వారసుడికే ఆమోదం..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. వై నాట్ 175 నినాదంతో సీఎం జగన్ ఎన్నికల సమరానికి సిద్దమయ్యారు. అటు టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. అభ్యర్దుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న వైసీపీ నాయకత్వం..అభ్యర్దుల ప్రకటన ప్రారంభించింది. తిరుపతి నుంచి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డిని పార్టీ అభ్యర్దిగా ప్రకటించారు. ఇక్కడి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం వేళ వైసీపీ నిర్ణయం ఆసక్తి కరంగా మారింది.
తిరుపతి అభ్యర్ధి ఖరారు: వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ కీలక నియోజకవర్గాలకు అభ్యర్దులను ఖరారు చేస్తోంది. ఇప్పుడు వారసులకు టికెట్ల ఖరారు పై కొంత కాలంగా పార్టీలో చర్చ సాగుతోంది. సీనియర్ నేతలు పలువురు తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని సీఎం జగన్ ను కోరుతున్నారు. దీని పైన నియోజకవర్గాల్లో పరిస్థితులు..సర్వే నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇప్పుడు కీలకమైన తిరుపతి నియోజకవర్గ వైసీపీ అభ్యర్దిగా టీటీడీ ఛైర్మన్ భూమన కుమారుడు అభినయ్ ను ఖరారు చేసారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, దక్షిణ కోస్తా జిల్లాల కో ఆర్డినేటర్ విజయ సాయి రెడ్డి. తిరుపతిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న విజయ సాయి రెడ్డి ప్రకటన చేసారు.
వారసుడికి లైన్ క్లియర్: అభినయ్ రెడ్డి గత ఎన్నికల్లో తండ్రి గెలుపుకు పని చేసారు. పార్టీ వ్యవహారాల్లో నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తిరుపతికి సీఎం జగన్..పార్టీ ముఖ్య నేతలు వచ్చిన సమయంలో అభినయ్ కు ప్రాధాన్యత లభిస్తోంది. టీటీడీ ఛైర్మన్ గా భూమన ఎంపిక సమయంలోనే..వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని..తన కుమారుడికి సీటు ఇవ్వాలని సీఎం ను కోరారు.

అయితే, సర్వేల ఆధారంగా ఇప్పుడు అభినయ్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి నియోజకవర్గం నుంచి భూమన రెండు సార్లు విజయం సాధించారు. ఇప్పుడు ప్రతీ సీటులో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వైసీపీ తిరుపతి నుంచి యువనేతగా పేరున్న అభినయ్ పేరు ఖరారు చేసింది.

హోరా హోరీ పోటీ: అటు చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర రెడ్డి కుమరుడు మోహిత్ కు లైన్ క్లియర్ అయింది. దీంతో, చిత్తూరు జిల్లాలోనే ఇద్దరు వారసుల పోటీకి ఆమోదం లభించినట్లయింది. ఇక, టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తిరుపతి నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. 2009 ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసిన చిరంజీవి ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా గెలుపొందారు.
పాలకొల్లు నుంచి అదే ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు పవన్ గోదావరి జిల్లా, తిరుపతి నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ ఇటు అభినయ్ ను ఎంపిక చేసింది. దీంతో, టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్దిగా ఎవరు బరిలో ఉంటారు..తిరుపతి ప్రజలు ఎవరికి మద్దతిస్తారనే లెక్కలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications