H-1B Visa పై బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్: కాగ్నిజెంట్ కు సమన్లు: రాడార్ లో భారత ఐటీ దిగ్గజాలు
హెచ్-1బీ (H-1B), పర్మ్ (PERM) వర్క్ వీసాల జారీ ప్రక్రియలో చోటు చేసుకున్న భారీ మోసాలపై డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. దేశంలో విదేశీ వలసదారుల ఉపాధికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తున్న కంపెనీలను ఏరిపారేసేందుకు కఠిన చర్యలు చేపట్టారు. ఈ వీసా కుంభకోణాలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టు ఎలిమినేట్ ఫ్రాడ్ ముమ్మర దర్యాప్తు ప్రారంభించింది.
ఈ దర్యాప్తు రాడార్‌లోకి ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌తో పాటు పలు ఐటీ దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ఈ వీసా అక్రమాలకు సంబంధించి అమెరికా కార్మిక శాఖ పరిధిలోని ఆఫీస్ ఆఫ్ ది ఇన్‌స్పెక్టర్ జనరల్ ఈ కీలక వివరాలను వెల్లడించింది. పలువురు యజమానులు, లేబర్ బ్రోకర్లు కుమ్మక్కై దొడ్డిదారిన నకిలీ దరఖాస్తులతో వీసాలు పొందుతున్నట్లు గుర్తించారు. వీటి ద్వారా విదేశాల నుంచి వచ్చే ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇస్తోన్నట్లు దర్యాప్తులో తేలింది.

అంతేకాకుండా, ఒప్పంద నిబంధనలను ఉల్లంఘిస్తూ వారి జీతాల నుంచి అక్రమంగా డబ్బును మినహాయించుకుంటోన్నట్లు సాక్ష్యాలను సేకరించారు. ఈ మోసపూరిత నియామకాల వల్ల అమెరికాకు చెందిన స్థానిక అభ్యర్థుల ఉపాధి అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని కార్మిక శాఖ ఆవేదన వ్యక్తం చేసింది. అమెరికా పౌరులను కాదని, తక్కువ జీతాలకే లభించే విదేశీ ఉద్యోగులను తీసుకుంటోన్నారని, దీనివల్ల తమ దేశ యువత నష్టపోతోందని తెలిపింది. ఈ మోసాలు దేశీయ లేబర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని దర్యాప్తు బృందాలు నిర్ధారించినట్లు పేర్కొంది.
ఈ వీసా నెట్‌వర్క్ మోసాల్లో దాదాపు డజన్ల కొద్దీ కంపెనీలకు ఇప్పటికే సమన్లు జారీ చేసినట్లు కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పోసిటో స్పష్టం చేశారు. ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ వంటి పెద్ద కంపెనీలలో జరుగుతున్న ఉల్లంఘనలపై తమకు విశ్వసనీయ సమాచారం అందిందని, కొందరు విజిల్ బ్లోయర్లు వీసా మోసాలకు సంబంధించిన కీలక పత్రాలను తమకు సమర్పించినట్లు చెప్పారు. దీంతో విచారణ వేగవంతం చేశామని పేర్కొన్నారు. ప్రొఫెషనల్స్ కొరతను తీర్చడానికే ఉద్దేశించిన గెస్ట్ వర్కర్ విసా విధానాన్ని సైతం దుర్వినియోగం చేశారని అన్నారు.
ఈ అకస్మాత్ పరిణామాలు భారత్‌కు చెందిన సాంకేతిక నిపుణులు, దేశీయ ఐటీలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా వీసాలపైన, ముఖ్యంగా కాగ్నిజెంట్ వంటి అగ్రశ్రేణి సేవల కంపెనీలపై ఆధారపడే ఎందరో భారతీయ టెక్కీల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ టాలెంట్‌కు ఈ కఠినమైన చర్యలు పెద్ద అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. రాబోయే రోజుల్లో హెచ్-1బీ, పర్మ్ వీసాల స్పాన్సర్‌షిప్ నిబంధనలను అమెరికా ప్రభుత్వం మరింత కఠినతరం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.













Click it and Unblock the Notifications