ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారంతో ఆదాయం.. సరికొత్తగా ఆ గోల్డ్ స్కీమ్!
బంగారం ఇష్టపడని వారు ఉండరు. అలాగే బంగారం కొనుగోలు చేసిందంతా మనం ఉపయోగించం. అలా నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌ను మార్పులు చేసి త్వరలో అమలు చేయనుంది. దేశవ్యాప్తంగా ఇళ్లల్లో సుమారు 30,000 టన్నుల బంగారం లాకర్లు, బ్యాంకు లాకర్లలోనే ఉండిపోయిందని అంచనా.
గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో గత పదేళ్లలో కేవలం 39టన్నుల బంగారం మాత్రమే
ఈ భారీ సంపదను వినియోగంలోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశంగా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ను మార్పులు చేసి తీసుకొస్తుంది కేంద్రం . 2015లో మొదటిసారి ప్రవేశపెట్టిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటం కారణంగా ఆ స్కీం లో మార్పులు చేస్తున్నారు. గత పదేళ్లలో కేవలం 39 టన్నుల బంగారం మాత్రమే సేకరించగలిగారు.

నిబంధనలను మార్పు చేసి కేంద్రం సరికొత్త విధానం
కఠినమైన బ్యాంకింగ్ నిబంధనలు, బంగారాన్ని కరిగించడంపై ప్రజల్లో ఉన్న సెంటిమెంట్, ప్యూరిటీ టెస్టింగ్ సెంటర్ల కొరత, అవగాహన లోపం వంటివి ప్రధాన కారణాలు. ఈ లోపాలను సరిదిద్దుతూ కేంద్రం ఇప్పుడు సరికొత్త విధానాన్ని తీసుకొస్తోంది. కొత్త పథకంలో అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. జువెలర్లను అగ్రిగేటర్లుగా నియమించడం. ఇకపై ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరంలేకుండా, తాము నమ్మే స్థానిక బంగారు వ్యాపారి వద్దకే వెళ్లి బంగారాన్ని డిపాజిట్ చేయవచ్చు.
జువెలర్లకు కొత్త వ్యాపార అవకాశాలు
జువెలర్లు కస్టమర్ల నుంచి బంగారాన్ని సేకరించి, ప్యూరిటీ పరీక్షించి, ఒకచోట చేర్చే బాధ్యత తీసుకుంటారు. దీని వల్ల ప్రజలకు సౌకర్యం పెరుగుతుంది, జువెలర్లకు కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. డిపాజిట్ చేసిన బంగారానికి ప్రభుత్వం వార్షిక వడ్డీ అందిస్తుంది. గడువు ముగిసిన తర్వాత అదే బరువు గల స్వచ్ఛమైన బంగారం లేదా అప్పటి మార్కెట్ ధర ప్రకారం నగదు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
కేంద్రం చేస్తున్న మార్పు ఏ మేరకు సత్ఫలితం ఇస్తుందో
దీని వల్ల ఇళ్లల్లో పడి ఉన్న బంగారం ఆదాయ వనరుగా మారుతుంది.ప్రతి సంవత్సరం భారత్ వందల టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇళ్లల్లో ఉన్న బంగారంలో కేవలం 5 నుంచి 10 శాతం మాత్రమే చలామణిలోకి తీసుకురాగలిగినా దిగుమతుల భారం గణనీయంగా తగ్గుతుంది. ఈ కొత్త పథకంపై విధి విధానాలు వెల్లడి చెయ్యాల్సి ఉంది. ప్రస్తుతం కేంద్రం చేస్తున్న మార్పు ఏ మేరకు సత్ఫలితం ఇస్తుందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications