19న ఛలో మెడికల్ కాలేజ్..! తాడోపేడో తేల్చుకోనున్న వైసీపీ..!
ఏపీలో పీపీపీ విధానంలో 10 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయంపై వివాదం నెలకొంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే వైసీపీ వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తోంది. గత వైసీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని అధికార కూటమి పార్టీలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు ఇప్పటికే ఆ పార్టీ నేతలు వివిధ ప్రాంతాల్లో కాలేజీలను సందర్శిస్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో ఒకేసారి అన్ని మెడికల్ కాలేజీల సందర్శనకు వైసీపీ సిద్దమైంది.
ఈనెల 19న వైయస్సార్‌సీపీ 'ఛలో మెడికల్ కాలేజీ'కార్యక్రమం చేపట్టనున్నట్లు ఇవాళ ప్రకటించింది. పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించింది. తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనెల 19న 'ఛలో మెడికల్ కాలేజీ' చేపడుతున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

ఈ నెల 19న ఆయా మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లే పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు అన్ని వాస్తవాలను ప్రజలకు వివరిస్తారని పార్టీ తెలిపింది. శాంతియుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని వెల్లడించింది. ఈ మేరకు వైయస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున 'ఛలో మెడికల్ కాలేజీ'లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

రాష్ట్రంలో వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కాలేదని, కేవలం సగం సగం బిల్డింగ్ లు కట్టి వదిలేసారని ఆరోపిస్తూ టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు. దీనికి కౌంటర్ గా ఇప్పుడు వైసీపీ కూడా తాము కట్టిన మెడికల్ కాలేజీల్ని ప్రజలకు చూపించడం ద్వారా వాస్తవాలను బయటపెడతామని ప్రకటించింది. అయితే ప్రభుత్వం దీనికి అనుమతిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications