నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ: వైఎస్ జగన్ భావోద్వేగం: ప్లీనరీ ముగిసిన మరుసటి రోజే ట్వీట్
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఎదురుగా నిర్వహించిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ విజయవంతమైనట్టే. శుక్ర, శనివారాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఆరు నుంచి ఏడు లక్షలమంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారని, ఇది విజయవంతమైందనీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి చెప్పారు.
ఫ్యామిలీ ఫంక్షన్..
రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో సాగుతామనీ సాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఈ ఉదయం ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్లీనరీకి సంబంధించిన డ్రోన్ విజువల్స్ క్లిప్‌ను ఈ ట్వీట్‌కు జత చేశారు. రాష్ట్రంలో పార్టీకి ఉన్న బలం ఎంత అనే విషయాన్ని బేరీజు వేసుకోవడానికి ఈ ప్లీనరీ ఉపయోగపడిందనీ స్పష్టం చేశారు. ప్లీనరీ మాత్రమే కాదని, వైసీపీ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్న ఓ శుభ కార్యక్రమంగా అభివర్ణించారాయన.
పార్టీ కేడర్ శ్రమించింది..
విజయవంతం చేయడానికి పార్టీ యంత్రాంగం మొత్తం శ్రమించిందని ప్రశంసించారు. వారి కష్టఫలం వల్లే ప్లీనరీ ఊహించినదాని కంటే ఎక్కువగా సక్సెస్ అయిందని అన్నారు. నకిలీ వార్తలపై సంక్షేమ ప్రభుత్వం సాధించిన విజయంగా సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ప్లీనరీని విజయవంతం చేసిన ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని అన్నారు. జై ఆంద్రా, జై జగన్ అంటూ తన ట్వీట్‌ను ముగించారు.

వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్..
ఆ కొద్దిసేపటికే వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఆయన భావోద్వేగాన్ని ప్రతిఫలింపజేసింది. లక్షలాదిగా తరలిరావడం ద్వారా పార్టీ, ప్రభుత్వంపై తమకు ఉన్న విశ్వాసాన్ని, అనుబంధాన్ని మరోసారి ప్రస్ఫూటింపజేశారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, గ్రామస్థాయి శ్రేణులు, ప్రజలకు మరోసారి సెల్యూట్ చేస్తోన్నట్లు చెప్పారు.

నడిపించే నాన్న..
దేవుడి దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల హృదయాలు నిరంతరం తనపై ఉన్నాయని వైఎస్ జగన్ చెప్పారు. అవే తనకు శాశ్వత అనుబంధాలు అని పేర్కొన్నారు. పార్టీ ప్లీనరీ.. కార్యకర్తలు, అభిమానుల సముద్రంగా మారిందని గుర్తు చేశారు. చెక్కు చెదరని మీ ఆత్మీయతలు, పార్టీకి, ప్రభుత్వానికి ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తెలిపిన మద్దతుకు మరోసారి సెల్యూట్ చేస్తోన్నానని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications