కాపు నేత ముద్రగడ ఇంటిపై తాజా దాడి- టీడీపీ అధికారంలో ఉన్న ప్రతీసారీ ఇంతేనా
Mudragada Padmanabham: కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోసారి టార్గెట్ అయ్యారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి తరహాలోనే ఇప్పుడు కూడా ఆయన ఇంటిపై దాడి ఘటన చోటు చేసుకుంది.
కాకినాడ జిల్లాలోని కిర్లంపూడిలో గల ముద్రగడ పద్మనాభం ఇంటిపై ఈ తెల్లవారు జామున ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. ట్రాక్టర్‌తో దాడికి దిగాడు. కిర్లంపూడి ఇంటి గేటు విరగ్గొట్టుకుని మరీ లోపలికి ప్రవేశించాడు. జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ప్రహరీగోడను దాటుకుని ఇంట్లోకి వచ్చినట్లు చెబుతున్నారు.

ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉంచిన కారును ట్రాక్టర్‌తో ఢీ కొట్టాడు. దీనితో కారు వెనుక భాగం దెబ్బతిన్నది. ఆ సమయంలో పెద్ద శబ్దం రావడంతో ముద్రగడ పద్మనాభం ఇంట్లో నుంచి బయటకొచ్చారు. ఇంట్లో ఉన్న అనుచరులు ఆ వ్యక్తిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు.
ఈ సమాచారం తెలియడంతో ముద్రగడ అభిమానులు పెద్దసంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుంటోన్నారు. ఫలితంగా కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముద్రగడ ఇంటివద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఈ ఘటన పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘాటుగా స్పందిస్తోన్నారు. ఈ దాడి ఘటన ఉద్దేశపూరకంగా చోటు చేసుకుందంటూ చెబుతున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో దర్యాప్తు జరపాలంటూ పట్టుబట్టుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతీసారీ ముద్రగడ పద్మనాభం, ఆయన ఇంటిపై దాడి జరగడం సర్వసాధారణమైపోయిందంటూ మండిపడుతున్నారు.
ముద్రగడ ఇంటిపై దాడి జరగడం పట్ల వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దాడిని తప్పు పట్టారు. కిర్లంపూడిలో ముద్రగడ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్వీట్‌ను పోస్ట్ చేశారాయన.












Click it and Unblock the Notifications