జగన్ భద్రతకు రంగంలోకి ప్రయివేటు సైన్యం - ఇక నుంచి..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ జిల్లాల పర్యటనల వేళ భద్రత పైన పార్టీ లో చర్చ జరుగుతోంది. తాజాగా జరిగిన పీఏసీ సమావేశంలోనూ జగన్ భద్రత పైన పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేసారు. పోలీసుల నుంచి సరైన భద్రత కల్పించటం లేదని.. భద్రతా పరంగా జాగ్రత్తగా ఉండాలని నేతలు సూచించారు. దీంతో, పార్టీ నేతలు జగన్ కు ప్రయివేటు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాల పర్యటనలో ఈ ప్రయివేటు సిబ్బంది జగన్ భద్రతా బాధ్యతలను చూసుకోనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ జిల్లాల పర్యటన వేళ సరైన భద్రత కల్పించటం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బంగారు పాళ్యం పర్యటన సమయంలో జగన్ చుట్టూ జనం చేరటం.. జగన్ తో కరచాలనం చేసేందుకు పోటీ పడటం.. తోపులాట చోటు చేసుకోవటం వంటి పరిణామాల పైన పార్టీ నేతలు చర్చించారు. తాజాగా జరిగిన వైసీపీ పీఏసీ సమావేశంలోనూ జగన్ భద్రత పైన ముఖ్య నేతలు పలు సూచనలు చేసారు. మాజీ ముఖ్యమంత్రిగా సరైన భద్రత అందటం లేదనే వాదన పార్టీ నేతలు వినిపించారు. భద్రత కోసం ప్రభుత్వం పైన ఆధారపడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్ పర్యటనల వేళ ఆంక్షల పైన చూపిస్తున్న ఆసక్తి.. భద్రత విషయంలో లేదని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

దీంతో, ఇప్పుడు జగన్ కు ప్రయివేటు సిబ్బందితో సెక్యూరిటీ కల్పించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా 40 మందితో భద్రత కల్పించనున్నారు. ఇప్పటికే పది మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది సేవలను జగన్ భద్రత కోసం వినియోగిస్తున్నారు. కొత్తగా ఈ 40 మందితో జగన్ వద్దకు దూసుకొచ్చే వారిని నియంత్రించటం.. రోప్ పార్టీ గానూ వ్యవహరించనున్నారు. జగన్ జిల్లాల పర్యటనల వేళ కారు నుంచి అభివాదం చేస్తుండగా అభిమానులు కారు పైకి ఎక్కుతున్నారు. వీరిని నియంత్రించే బాధ్యత ఈ ప్రయివేటు సెక్యూరిటీకి అప్పగించారు. ఈ ప్రయివేటు సెక్యూరిటీ సేవలు జగన్ డోన్ పర్యటన నుంచి మొదలు అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 6న జగన్ డోన్ లో
మాజీ ఆర్దిక మంత్రి బుగ్గన కుమారుడు బుగ్గన అర్జున్ రెడ్డి రిసెప్షన్ కు హాజరు కానున్నారు. అదే విధంగా ఇక నుంచి జరిగే జిల్లాల పర్యటనల్లోనూ ఈ సెక్యూరిటీ వినియోగించాలని డిసైడ్ అయ్యారు.












Click it and Unblock the Notifications