"బాబు ఎవరిని కలిసొచ్చారో చెప్పాలి?, ఢిల్లీలో ఎందుకు అదృశ్యమయ్యారు"
అమెరికా పర్యటన ముగించుకుని ఇండియాలో అడుగుపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగాక ఆరు గంటల పాటు ఎక్కడికో వెళ్లిపోయారని వైసీపీ ఆరోపిస్తోంది.
విజయవాడ: అమెరికా పర్యటన ముగించుకుని ఇండియాలో అడుగుపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగాక ఆరు గంటల పాటు ఎక్కడికో వెళ్లిపోయారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరుగంటల సమయంలో ఆయన రహస్య భేటీ నిర్వహించారని, ఎవరితో భేటీ అయ్యారన్న విషయాన్ని బయటపెట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ఇదే విషయంపై చంద్రబాబును ప్రశ్నించారు. ఢిల్లీలో రహస్యంగా ఎవరిని కలిశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. కాగా, మధ్యాహ్నాం 3.15గం.కు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి విజయవాడ రావాల్సి ఉండగా.. రాత్రి 9గం. వరకు ఎక్కడికో వెళ్లిపోయారని వార్తలు వస్తున్నాయి.

టీడీపీకి చలిజ్వరం:
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీతో భేటీ అయ్యాక.. టీడీపీ నేతలకు చలిజ్వరం పట్టుకుందని జోగి రమేష్ అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రెండు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని టీడీపీ దోచుకుందన్న విషయాన్ని కూడా ప్రధానికి చెప్పినట్లు పేర్కొన్నారు.

సీఎం ఎందుకు అదృశ్యం?:
మోడీతో భేటీ తర్వాత జగన్ బహిరంగంగానే వివరాలు వెల్లడించారని, కానీ అమెరికా పర్యటన నుంచి వచ్చిన చంద్రబాబు.. ఎవరికి అందుబాటులో లేకుండా అదృశ్యమైపోయారని అన్నారు. ప్రత్యేక విమానాల్లో 16దేశాలు తిరిగొచ్చిన చంద్రబాబు.. ఎన్ని కంపెనీలతో ఎంఓయులు కుదుర్చుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఖర్చు వివరాలు బయటపెట్టండి?:
సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన ఖర్చు వివరాలు బహిర్గతం చేయాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారన్ని మండిపడ్డారు. ఇప్పటికైనా ఢిల్లీలో సీఎం రహస్య పర్యటనపై వివరాలను వెల్లడించాలన్నారు.

వివాదంలో అమెరికా టూర్:
చంద్రబాబు అమెరికా టూర్ ఈమెయిల్ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం నడిచింది. అమెరికాలో ఎలాంటి అనుమతులు లేకుండా.. సభల ద్వారా నిధులు సేకరిస్తున్నారని, చంద్రబాబును అరెస్టు చేయాలని కోరుతూ అమెరికా ప్రభుత్వానికి కొన్ని ఈమెయిల్స్ వెళ్లడంతో ఈ వివాదం తలెత్తింది.












Click it and Unblock the Notifications