తెలుగుదేశం కంచుకోటపై జగన్ కన్ను
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో కూడిన ఉత్తరాంధ్ర చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉండేది. గత ఎన్నికల్లో జగన్ హవా ముందు ఇక్కడ కూడా టీడీపీ నిలవలేకపోయింది. గత ఎన్నికల్లో ఇచ్ఛాపురం, టెక్కలి స్థానాల్లోనే గెలవగలిగింది.

అచ్చెన్నను కచ్చితంగా ఓడించాలి?
టెక్కలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుణ్ని ఓడించాలంటే బలమైన అభ్యర్థి అవసరమని జగన్ భావించారు. అందుకనుగుణంగా ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ కు టికెట్ ఖరారుచేసి పనిచేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో ఇప్పుడు గెలుచుకున్నవాటితోపాటు ఈ రెండింటిలో కూడా విజయం సాధించాలని నాయకులందరికీ ఖరాఖండిగా చెప్పేశారు. శ్రీకాకుళం ఎంపీ స్థానంలో రామ్మోహన్ నాయుడు ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న మూడు లోక్ సభ నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి.

ఉమ్మడి జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలి
ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకుంటే జిల్లాను క్లీన్ స్వీప్ చేయొచ్చని సీఎం భావిస్తున్నారు. అందుకనుగుణంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో ప్రధాన సమస్యలేమిటన్నదానిపై ఆయన దృష్టిసారించి ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకు పరిష్కారంగా ఆసుపత్రిని నిర్మింపచేస్తున్నారు. అలాగే ఇక్కడి నుంచి ఉపాధి కోసం వలసలు ఎక్కువగా ఉంటాయి. వాటి నిరోధానికి జగన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలపై కూడా జిల్లాలో ఎక్కడా ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తం కాకుండా ముందుజాగ్రత్తలు చేపట్టారు. మంత్రి సీదిరి అప్పలరాజు, దువ్వాడ శ్రీనివాస్ దూకుడైన రాజకీయం చేస్తూ ఫైర్ బ్రాండ్స్ గా పేరుతెచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ వైపు ఎక్కువగా ఆకర్షితులయ్యే యువతను వైసీపీవైపు మళ్లించేలా వీరిద్దరూ రాజకీయం చేస్తున్నారు.

మూడు రాజధానులపై ధర్మాన సోదరుల కృషి
ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ ఇద్దరూ విశాఖపట్నం రాజధానిగా ఉండేందుకు మేధావుల ఫోరంతోపాటు జేఏసీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. కొంతమంది మేధావులను కూడా కలుస్తూ ఇక్కడి ప్రజలకు జగన్ చేస్తున్న మేలును చంద్రబాబు ఏవిధంగా అడ్డుకుంటున్నారనే విషయాన్ని వివరించి చెబుతున్నారు. దీనిపై వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడు ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడికక్కడ మూడు రాజధానులకు అనుకూలంగా సదస్సులు నిర్వహిస్తున్నారు.

బలమైన నాయకులు.. సంస్థాగత బలం
అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష, కావలి గ్రీష్మ, గుండ లక్ష్మీదేవి, బెందాళం అశోక్ లాంటి బలమైన నాయకులు టీడీపీకి ఉండటంతోపాటు సంస్థాగతంగా ఇక్కడ బలంగా కనపడుతోంది. దీంతో ఈ జిల్లాలో ఇరుపార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం కనపడుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపొందిన నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులంతా చెక్కుచెదరకుండా నిలవడం ఆ పార్టీకి కలిసొస్తోంది. తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వైసీపీ ప్రచారం చేస్తోంది. అభ్యర్థుల పరంగా రెండు పార్టీలు బలంగా ఉన్నాయి. ఏదైనా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటే తప్ప.. ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగే జిల్లాగా ఇది నిలవనుంది.












Click it and Unblock the Notifications