నారా లోకేశ్ రెడ్‌బుక్‌కు మా ఇంటి కుక్క కూడా భయపడదు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దారుణంగా తయారైందని చంద్రబాబు తెలిపారు. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇచ్చిందని వెల్లడించారు. అలాగని, కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించలేనని ఆయన స్పష్టం చేశారు. డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించనని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదని, ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే పథకాలు అమలు చేస్తామని చెప్పారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత అమలు చేస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యాలపై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

చంద్రబాబుకు ఆయన కౌంటరిచ్చారు. గుంటూరులోని క్యాంప్ కార్యాలయంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని, అందువల్లే ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని తాను అమలు చేయలేనని చంద్రబాబు ప్రకటించడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ప్రభుత్వంలో చేసిన అప్పులను, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులను ఈ సందర్భంగా అంబటి బయటపెట్టారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చను అని చంద్రబాబు స్వయంగా తన అసమర్థతను అంగీకరిస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు.
చంద్రబాబు హామీలు అమలు చేయలేనివి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు అనుగుణంగా లేదని ఆనాడే జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా నేను సంపద సృష్టిస్తా అని చంద్రబాబు ప్రజలను నమ్మించి, మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు.దావోస్‌కు వెళ్లి పైసా పెట్టుబడి కూడా తీసుకురాలేదని విమర్శించారు. దావోస్ పర్యటనకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. నారా లోకేశ్ రెడ్‌బుక్‌కు మా ఇంట్లో కుక్క కూడా భయపడదని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications