నగరిలో రోడ్డుపై బైఠాయించిన రోజా: ఎంపీటీసీ ఫలితం తారుమారు
చిత్తూరు జిల్లా విజయపురం మండలం పరిధిలోని ఇల్లత్తూరు ఎంపీటీసీ స్థానం ఉప ఎన్నికల ఫలితంపై తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆర్కే రోజా నిరసనకు దిగారు. నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎన్నికల అధికారులు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి తమ పార్టీ అభ్యర్థి విజయాన్ని తారుమారు చేశారని రోజా ధ్వజమెత్తారు.
ఇల్లత్తూరు ఎంపీటీసీ స్థానంలో తమపార్టీ అభ్యర్థి ఉదయగిరి దేవి 10 ఓట్ల స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించినట్లు మొదట ఎన్నికల సిబ్బంది సమాచారం ఇచ్చారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత తెలుగుదేశం విజ్ఞప్తి మేరకు చేపట్టిన రీకౌంటింగ్ లో ఆ పార్టీ అభ్యర్థి జయప్రద మూడు ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచినట్లు అధికారులు హఠాత్తుగా ప్రకటించడం ఆ నిరసనకు కారణమైంది. ఒకే స్థానంలో రెండు రకాల ఫలితాలు వెలువడటంపై వైసీపీ అభ్యర్థి, ఏజెంట్లు అక్కడికక్కడే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

లెక్కింపు కేంద్రంలో రీకౌంటింగ్ విధానం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, చెల్లని ఓట్ల లెక్కింపుపై తమకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని రోజా ఆరోపించారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని, తక్షణమే తిరిగి పూర్తిస్థాయి ఓట్ల లెక్కింపు చేపట్టి పారదర్శకత నిరూపించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తమ అభ్యర్థి ఉదయగిరి దేవికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ రోజా కంటతడి పెట్టారు.
ఫలితంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిన వెంటనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో నగరి డిగ్రీ కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. ఓట్ల లెక్కింపు అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించినప్పటికీ, న్యాయం జరిగే వరకు తమ నిరసనను విరమించేది లేదని రోజా తేల్చిచెప్పారు.
ఇల్లత్తూరు ఎంపీటీసీ పరిధిలో నమోదైన మొత్తం ఓట్లకు, లెక్కింపు పత్రాల్లో అధికారులు నమోదు చేసిన గణాంకాలకు పొంతన లేదని రోజా విమర్శించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, వీడియోగ్రఫీ ఆధారాలను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల అధికారుల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె.. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని, న్యాయస్థానంలో సవాల్ చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications
