జగన్ పార్టీ: సింగిరెడ్డిపై మహిళా నేత చెప్పుతో దాడి
కరీంనగర్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కరీంనగర్ జిల్లా నాయకత్వంలో విభేదాలు రచ్చకెక్కాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా వందనం జరుగుతున్న సమయంలో కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జెండా ఆవిష్కరణకు వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై జిల్లా మహిళా విభాగానికి చెందిన ప్రధాన కార్యదర్శి గంటా సుశీల చెప్పుతో దాడి చేశారు.
సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత భాస్కర్‌రెడ్డి పార్టీకి అందుబాటులో ఉండకపోవడం, పార్టీ కార్యాలయానికి తాళం వేసి కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మహిళా నేత ఆరోపించారు, శుక్రవారంనాడు స్వాతంత్య్ర వేడుకలకు సైతం తనకు అనుకూలంగా ఉండే వారికే భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఆ విషయం తెలుసుకున్న సుశీల అక్కడకు చేరుకుని జెండా ఆవిష్కరణ పూర్తి అయిన తర్వాత ఊహించని రీతిలో భాస్కర్‌రెడ్డిపై చెప్పుతో దాడి చేశారు. సుశీలకు మద్దతుగా కొంత మంది కార్యకర్తలు భాస్కర్‌రెడ్డిపై దాడి చేశారు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్న కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు.
పార్టీ స్థాపించినప్పటి నుంచి చురుగ్గా పనిచేస్తున్న తనకు పార్టీ అధ్యక్షుడు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి తమను ఆహ్వానించలేదని సుశీల విమర్శించారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న తమను సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అవమానాలకు గురి చేస్తున్నాడని ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications