బాలినేనిదే పొరబాటు..! హైకోర్టులో తేల్చేసిన ఈసీ..
ఏపీలో రెండు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం తప్పిదాల కారణంగా ఫలితాలు తారుమారైనట్లు భావిస్తున్న వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే తీరా ఈసీ రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించాక దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ విచారణలో ఈసీ తన అభిప్రాయం వెల్లడించింది.
ఈవీఎంల వెరిఫికేషన్ కోసం సుప్రీంకోర్టు గతంలో మార్గదర్శకాలు ఇచ్చింది. వీటి ప్రకారం ఈవీఎంలలో ఏవైనా తప్పిదాలు జరిగాయా అన్నది తేల్చేందుకు నిబంధనలు కూడా విడుదల చేసింది. వీటి ప్రకారమే ఇప్పుడు ఈసీ ఒంగోలు నియోజకవర్గంలో ఈవీఎంల రీవెరిఫికేషన్ చేపట్టింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఈవీఎంలలో ఉండే సాఫ్ట్ వేర్ ట్యాంపర్ జరిగిందా లేదా అన్నది అభ్యర్ధుల సమక్షంలో తేలుస్తారు. కానీ బాలినేని మాత్రం ఈవీఎంల వెరిఫికేషన్ అంటే వీవీ ప్యాట్ స్లిప్పుల్ని ఈవీఎంలలో పడిన ఓట్లతో సరిపోల్చాలని, కానీ ఈసీ అలా చేయడం లేదని పిటిషన్ లో అభ్యంతరం తెలిపారు.

దీనిపై హైకోర్టు విచారణలో ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. సుప్రీంకోర్టు గతంలో ఈవీఎంల రీవెరిఫికేషన్ కోసం ఇచ్చిన ఆదేశాల్ని పిటిషనర్ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుగా అర్దం చేసుకున్నారని హైకోర్టుకు తెలిపింది. సుప్రీం తీర్పు ప్రకారం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించే ప్రశ్నే తలెత్తదని క్లారిటీ ఇచ్చింది. కేవలం మాక్ పోలింగ్ మాత్రం నిర్వహిస్తారని తెలిపింది. దీంతో ఇప్పుడు హైకోర్టు.. ఎన్నికల సంఘం రీవెరిఫికేషన్ కోసం జారీ చేసిన నిబంధనలు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయో లేదో తేల్చబోతోంది.












Click it and Unblock the Notifications