ఆఖరి అరగంట జగన్ ను వదిలేశారా ? భూమన షాకింగ్ రీజన్ ..!
ఏపీలో నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన తీవ్ర కలకలం రేపింది. తోతాపురి మామిడి రైతుల్ని పరామర్శించేందుకు జగన్ చేపట్టిన ఈ టూర్ పై ముందు నుంచీ ప్రభుత్వం ఆంక్షలు విధించి కట్టడి చేసే ప్రయత్నం చేసింది. అయినా భారీగా రైతులు, జనం తరలివచ్చి జగన్ కు సంఘీభావం తెలిపారు. జగన్ కూడా రైతుల్ని పరామర్శించి భరోసా ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు మాత్రం వైసీపీని కలవరపెట్టాయి.
ముఖ్యంగా జగన్ టూర్ సందర్భంగా భారీగా జనం తరలివచ్చినా వారిని నియంత్రించేందుకు పోలీసులు పూర్తిగా ప్రయత్నించకపోవడం, జగన్ రైతులతో మాట్లాడుతున్నప్పుడు కూడా జనం దూసుకురావడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిని నియంత్రించకుండా తిరిగి వైసీపీ అధినేతపై అధికార కూటమి నేతలు విమర్శలకు దిగడంపై ఆ పార్టీ మండిపడుతోంది.

జగన్ బంగారుపాళెం టూర్ విజయవంతం అవ్వడాన్ని జీర్ణించుకోలేకే టీడీపీకి మద్దతుగా ఉన్న కొన్ని మీడియా సంస్థలు ఆయనపై ద్వేషాన్ని చాటుకున్నాయని వైసీపీ అదికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. జగన్ కోసం వచ్చిన మామిడి రైతులను క్రూరమైన దొంగలు, అసాంఘిక శక్తులు, దండుపాళ్యం బ్యాచ్ అంటూ ఉచ్ఛం, నీచం మరిచి పతాకశీర్షికల్లో దూషించడం ద్వారా తమ కడుపుమంటను బయటపెట్టుకున్నారని విమర్శించారు.

ఇదంతా ఓ ఎత్తయితే నిన్న జగన్ పర్యటనకు సంబంధించి ఆఖరి అరగంట వరకు సెక్యూరిటీని టైట్ చేసి, తరువాత భద్రతను ఎందుకు పూర్తిగా వదిలేశారని భూమన ప్రశ్నించారు. అంటే వైయస్ జగన్‌ను ఏమైనా చేయాలనే కుట్ర దీనిలో దాగుందా అని అడిగారు. ఎక్కడా వైయస్ జగన్‌కు పోలీస్ రక్షణ లేకుండా చేసేశారన్నారు. జెడ్‌ప్లస్ కేటగిరిలో ఉన్న నాయకుడి విషయంలో ఇలాగేనా చేసేదని ప్రశ్నించారు. రెండు వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో ఉంటే, మార్కెట్ యార్డ్‌లో మూడు వందల మంది పోలీసులను మోహరింపచేశారని, కానీ ఆఖరి క్షణంలో ఆయన పక్కన ఎవరూ లేకుండా పోవడం వెనుక కుట్ర ఉందనే అనుమానం కలుగుతోందన్నారు.












Click it and Unblock the Notifications