బొత్సాను సస్పెండ్ చేస్తారా..? వైసీపీలో కీలక పరిణామాలు...!!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ విజయనగరం కేంద్రంగా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మజ్జి శ్రీను రాజీనామా తరువాత వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. బొత్సా కుటుంబంలో రాజకీయంగా చీలక కనిపిస్తోంది. పలు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం సైతం వైసీపీ వీడుతుంది. ఇదే క్రమంలో బొడ్డుకొండ అప్పలనాయుడు పైన జగన్ సస్పెన్షన్ వేటు వేసారు. దీంతో, ఆయన పార్టీకి రాజీనామా చేసారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
విజయనగరం వైసీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మజ్జి శ్రీనివాస రావు పార్టీ వీడిన తరువాత కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. పలువురు జడ్పీటీసీలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఆ పార్టీకి నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే, జడ్పీ మాజీ చైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడు రాజీనామా చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన కొన్ని గంటలకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గౌరవం లేని చోట తాను, తన అనుచరులు ఉండలేమని అప్పల నాయుడు తెలిపారు. అందుకే వైసీపీకీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓ నియంత అని అభివర్ణించారు. ఆ పార్టీ ఓ లిమిటెడ్ కంపెనీ అని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక చర్యలు చేయడం వల్లే వైసీపీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైందని తెలిపారు. వైసీపీలో క్రమశిక్షణ కమిటీ అంటూ ఒకటి వుందా? అని ఆ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు.

బొత్సాను సస్పెండ్ చేయగలరా- అప్పలనాయుడు సవాల్ తో
మజ్జి శ్రీను రాజీనామా తరువాత అప్పలనాయుడు ను నెల్లిమర్ల ఇంచార్జ్ పదవి నుంచి తప్పించి జెడ్పీటీసీ సన్యాసి నాయుడుకు ఆ బాధ్యతలు అప్పగించారు. తాజాగా స్థానిక సంస్థల పైన జగన్ జిల్లాల వారీగా నేతలతో ఒన్ టు ఒన్ సమావేశాలు నిర్వహించారు. బొత్సాతో సహా పార్టీ నేతలతో విజయనగరంలో సమీకరణాల పైన సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పుడు తాజాగా అప్పలనాయుడు పైన సస్పెన్షన్ వేటు వేసారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. దీంతో.. పార్టీకి రాజీనామా చేసిన అప్పలనాయుడు సొంత పార్టీ కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చెలరేగుతున్నారంటూ వైసీపీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. చిన్న శ్రీను తన బావ కాబట్టి తనను కారణం లేకుండా సస్పెండ్ చేశారని విమర్శించారు. మరి చిన్న శ్రీనుకి బావ బొత్స సత్యనారాయణ అని వ్యాఖ్యానిస్తూ... మరి ఆయన్ని కూడా సస్పెండ్ చేయగలరా..? అంటూ వైసీపీకి బడ్డుకొండ అప్పలనాయుడు సవాల్ విసిరారు.













Click it and Unblock the Notifications
