ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో.. అనూహ్య పరిణామాలు: బీసీ నేతకు ఫోన్ కాల్
Alla Rama Krishna Reddy: గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియెజకవర్గం రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సంభవిస్తోన్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. తన పదవితో పాటు పార్టీకీ గుడ్‌బై చెప్పారాయన. తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో- మంగళగిరి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు ప్రాతినిథ్యాన్ని వహిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఆర్కే తప్పుకోవడం వల్ల ఏర్పడిన ఖాళీని ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఓ వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ఇన్‌ఛార్జీగా నియమించడం ఖాయంగా కనిపిస్తోంది.

మంగళగిరి ఇన్‌ఛార్జీగా గంజి చిరంజీవిని అపాయింట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పద్మాశాలి సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి.. గత ఏడాదే ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. టీడీపీకి గుడ్‌బై చెప్పిన అతి కొద్దిరోజుల్లోనే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి, ఆయన సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు.
అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో బీసీ సామాజిక వర్గం ఓటర్లు పెద్ద సంఖ్యలో నివసిస్తోన్నారు. వారిలో మెజారిటీలు పద్మశాలీయులే. ఇప్పుడదే సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి రాకతో వైఎస్ఆర్సీపీ మరింత బలోపేతమైనట్టే.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు గంజి చిరంజీవి. 12 ఓట్ల తేడాతో మాత్రమే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019లో ఆయనకు టికెట్ దక్కలేదు. నారా లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేసి, అదే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో మట్టికరిచారు. ఆ తరువాత గంజి చిరంజీవి.. వైసీపీలోకి రావడం- ఆర్కే రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications