ఇలా అయితే ఏపీకి విదేశీ పెట్టుబడులు ఎలా?: బాబును ప్రశ్నించిన వైసీపీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ వైసీపీ సీనియర్ నేత కె. పార్థసారధి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో విదేశీ పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ప్రధాని నరేంద్రమోడీతో పోటీ పడుతూ విదేశీ పర్యటనలు చేస్తున్న చంద్రబాబు, ఇప్పటివరకు రాష్ట్రానికి సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంవోయూల ద్వారా ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయగలరా? అంటూ సవాల్ విసిరారు.
చంద్రబాబు చేసే ప్రతి పనిలో అవినీతి కంపు కొడుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎందులో చూసినా అవినీతి విలయ తాండవం చేస్తుందని, ఇలా అయితే విదేశీ పెట్టుబడలు ఎలా వస్తాయని అన్నారు. చంద్రబాబు బారి నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రమే కాపాడాలని ఆయన అన్నారు.

సైద్ధాంతికంగా, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే వైసీపీపై టీడీపీ నేతలు బురద చల్లుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి తమ పార్టీ అధినేత వైయస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో స్విస్ చాలెంజ్ పేరుతో దోపిడీకి పెద్దఎత్తున తెర తీశారని ఆయన మండిపడ్డారు. రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications