సుప్రీంకోర్టు తీర్పుపై వైసీపీ ఫస్ట్ రియాక్షన్-రోజా ఏమన్నారంటే ?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిందన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం ఈ వివాదంపై నిర్వహిస్తున్న సిట్ దర్యాప్తు నిలిచిపోయింది. అదే సమయంలో రాజకీయంగా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై వైసీపీ నేత ఆర్కే రోజా స్పందించారు.

తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ ప్రత్యేక దర్యాప్తు చేయించాలని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామితో పాటు పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ప్రత్యేక సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, అలాగే కేంద్ర ఆహార నియంత్రణ సంస్థ నుంచి ఒకరు ఉండేలా ఈ సిట్ ఏర్పాటు కానుంది. ఈ నిర్ణయాన్ని వైసీపీ నేత ఆర్కే రోజా స్వాగతించారు.

సుప్రీంకోర్టు తీర్పుతో అయినా సున్నితమైన భక్తుల మనోభావాలతో కూడుకున్న శ్రీవారి ప్రసాదాల విషయంలో రాజకీయ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు మానుకుంటే మంచిదని వైసీపీ నేత ఆర్కే రోజా సూచించారు. ముఖ్యమంత్రే లడ్డూపై ఆరోపణలు చేసి, తిరిగి ఆ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నడిచే సిట్ తో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు బయటికి రావని తాము ముందే చెప్పామని రోజా గుర్తుచేశారు. అందుకే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు కోరుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు కేంద్రం కూడా అదే చెప్పిందన్నారు. సుప్రీం పర్యవేక్షణలో జరిగే స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు బయటికి వస్తాయని తిరుపతి ఆడబిడ్డగా నమ్ముతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications