దానికి అతి పెద్ద ఉదాహరణ చంద్రబాబే..!!
అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. పరిశ్రమలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి తరలి వస్తోండటాన్ని చూసి ఓర్వలేకపోతోందని ఆరోపించారు. టీడీపీ హయాంలో కంటే పారిశ్రామికవేత్తలకు వేగంగా అనుమతులను మంజూరు చేస్తోన్నామని, నిబంధనలకు అనుగుణంగా సింగిల్ విండో సిస్టమ్‌లో అనుమతులు ఇస్తోన్నామని పేర్కొన్నారు.

24 వేల కోట్లు..
తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తోంటే ఎల్లోమీడియా, పచ్చ బ్యాచ్ విషం కక్కుతోందని సజ్జల రామకృష్ణా రెడ్డి ధ్వజమెత్తారు. పెట్టుబడులు పెట్టేవారందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బంధువులేనంటూ ప్రచారం చేస్తోండటాన్ని ఆయన తప్పుపట్టారు. 24 వేల కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.

పెట్టుబడులు రాకుండా..
వీటిని చూసి చంద్రబాబు, ఆయన అనుకూల మీడియాకు కడుపు మంటగా ఉందంటూ సజ్జల ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న పారిశ్రామిక విధానాలను చూసి అదానీ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తోన్నారని, వారంతా వైసీపీ నాయకులకకు బంధువులైనట్లు చూపించే ప్రయత్నం చేస్తోన్నారని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులకు రాకుండా చేయడానికి ఎల్లో మీడియా తెగ తాపత్రయ పడుతోందని విమర్శించారు.

రాత్రికి రాత్రి చంద్రబాబు సీఎం..
చంద్రబాబు హయాంలో కడప స్టీల్ ప్లాంట్‌ను ఎందుకు కట్టలేక పోయారని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం పరిశ్రమలను తీసుకొస్తోంటే- కడుపుమంటతో చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా వెటకారం చేస్తోందని మండిపడ్డారు. వైఎస్ జగన్ అర్జెంటుగా ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోవాలి, చంద్రబాబు రాత్రికి రాత్రి అధికారంలోకి వచ్చేయాలనే లక్ష్యంతో ఎల్లో మీడియా పని చేస్తోందని ఆరోపించారు. ఈ రెండు జరిగితే.. అనుకూల మీడియాకు అంతా ప్రశాంతంగా కనిపిస్తుందని చురకలు అంటించారు.

30 శాతం వేతనాల చెల్లింపుల్లో జాప్యం..
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పర్మినెంట్, కాంట్రాక్ట్- ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేర్వేరు తేదీలకు జీతాలు అందేవని, తమ ప్రభుత్వం మాత్రం అందరికీ ఒకేసారి జీతాల విడుదల చేస్తోందని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. దానివల్లే ఆలస్యమౌతోందని చెప్పారు. మొత్తం జీతాలు, పింఛన్ల చెల్లింపుల్లో 70 శాతం వరకు 1, 2 తేదీల్లోనే జమ అవుతున్నాయని ఆయన వివరించారు. మిగిలిన 30 శాతం వేతనాల చెల్లింపుల్లోనే జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.

సంక్రాంతి నాటికి..
ఈ నెలలో కూడా ఆ 30 శాతం వేతనాల చెల్లింపుల్లో ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సజ్జల వివరణ ఇచ్చారు. ఇకపై ఆలస్యం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, సంక్రాంతి నాటికి సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందని, ఆ కక్షతోనే ప్రజలపై తమ అక్కసును, కడుపుమంటను చంద్రబాబు వెల్లగక్కుతున్నారని సజ్జల విమర్శించారు. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో చెప్పడానికి చంద్రబాబే అతిపెద్ద ఉదాహరణ అని చెప్పారు.












Click it and Unblock the Notifications