రాజధానిగా అమరావతిపై వైసీపీ కీలక నిర్ణయం
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులను వ్యవస్థను వ్యతిరేకిస్తూ ఒకవంక అమరావతి ప్రాంత రైతుల పాదయాత్ర సాగిస్తోన్నారు. ఇదే అంశం మీద అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలాకాలంగా ముప్పేటదాడిని ఎదుర్కొంటూ వస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇదివరకే ఉపసంహరించుకుంది.

అధికార వికేంద్రీకరణ కోసం..
అధికార వికేంద్రీకరణే తమ లక్ష్యమంటూ మంత్రులు పలు సందర్భాల్లో స్పష్టం చేస్తోన్నారు. దీన్ని స్వాగతిస్తూ అటు రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఊపందుకున్నాయి. జోరుగా సాగుతున్నాయి. తొలుత విశాఖపట్నం, అనంతరం కాకినాడ, రాజమండ్రిల్లో రౌండ్ టేబుల్ భేటీలు ఏర్పాటయ్యాయి. మూడు రాజధానులను స్వాగతిస్తూ- త్వరలో రాయలసీమ జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.

మరోసారి క్లారిటీ..
ఈ పరిణామాల మధ్య- వైఎస్ఆర్సీపీ తన వైఖరేమిటనేది మరోసారి స్పష్టం చేసింది. అధికార వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపుతామని పార్టీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పునరుద్ఘాటించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రం నష్టపోతుందంటూ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా చేస్తోన్న దుష్ప్రచారాలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని అన్నారు.

టెలికాన్ఫరెన్స్‌లో..
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో మాట్లాడారు. వైసీపీ రాజకీయ లక్ష్యం అధికార వికేంద్రీకరణేనని, ఇందులో ఎలాంటి గందరగోళం లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి వివరించారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వేర్పాటువాదం రాకుండా ఉండటానికే వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చారని చెప్పారు.

అమరావతి మాత్రమే ఉండాలనుకోవడం..
రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా కోరుకుంటోందని, బినామీలను కాపాడటానికే ఈ నినాదాన్ని అందుకున్నారని విమర్శించారు. అధికార వికేంద్రీకరణను స్వాగతిస్తూ ఇదివరకు ఏర్పాటైన రౌండ్ టేబుల్ సమావేశాలు విజయవంతం కావడాన్ని బట్టి చూస్తే- దీన్ని అందరూ స్వాగతిస్తోన్నారనేది స్పష్టమౌతోందని సజ్జల పేర్కొన్నారు. అమరావతి కూడా బాగుండాలనే ప్రభుత్వం కోరుకుంటోందని, మూడు రాజధానుల్లో అదీ ఒకటని గుర్తు చేశారాయన.












Click it and Unblock the Notifications