లోకేష్‌కు ఆ మాట తప్ప చంద్రబాబు ఇంకేమీ నేర్పించలేదు..!!
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రజా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి- మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చీకటికి ప్రతినిధి కాగా- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలుగురేఖ వంటి వారని, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులను నింపుతారని అన్నారు.
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలు గుర్తుకొస్తారని, గతంలో ముఖ్యమంత్రి హోదాలో నాయీ బ్రాహ్మణుల తోకలు కత్తిరస్తానంటూ అవహేళన చేశారని సజ్జల గుర్తు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన నాయీబ్రహ్మణ కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు హయాంలో బీసీలు ఎలాంటి దుర్భర పరిస్థితులను చవి చూశారో అందరికీ తెలిసిందేనని అన్నారు.

వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందని సజ్జల చెప్పారు. ఏం పీకుతున్నారు.. అనే మాట తప్ప చంద్రబాబు తన కొడుకు నారా లోకేష్‌కు ఇంకేమీ నేర్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ నోరు తెరిస్తే ఆ పీకుడు భాషే మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు మీడియ బలం తప్ప ప్రజల మద్దతు లేదని వ్యాఖ్యానించారు.
తమ ప్రభుత్వ హయాంలోనే నాయీ బ్రాహ్మణులకు చట్ట సభలో అడుగు పెట్టే అవకాశం దక్కుతోందని సజ్జల అన్నారు. తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేయాలని, రాష్ట్రంలో గల 175 నియోజకవర్గాలను గెలుచుకోవడం ద్వారా అది సాధ్యపడుతుందని చెప్పారు. 175కు 175 అసెంబ్లీ సీట్లను గెలవడమే లక్ష్యంగా పని చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.

సంక్షేమం అంటే ఎలా ఉండాలో వైఎస్ జగన్ చేతల్లో చేసి చూపించారని, నాయీ బ్రాహ్మణులు సగర్వంగా కాలర్ ఎగిరేసి జీవించేలా చేశారని సజ్జల ప్రశంసించారు. ఆయనకు నాయీ బ్రాహ్మణుల సామాజిక వర్గం అండగా ఉండాలని కోరారు. నాయీ బ్రాహ్మణులకు ఇప్పటికే ఆలయాల పాలక మండళ్లలో అవకాశం కల్పించారని, చట్ట సభల్లో కూడా అవకాశం దక్కుతుందని భరోసా ఇచ్చారు.
బీసీలకు ఇప్పటికే అధికభాగం పదవులు ఇచ్చామని, బీసీలను బ్యాక్ బోన్ క్యాస్ట్‌గా భావిస్తామని చెప్పారు. రాజ్యాధికారాన్ని అనుభవించే నిజమైన అర్హత బీసీలకు ఉందని, అందుకే వారికి జగన్ ఎన్నో పదవులు ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ జగన్.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయట్లేదని, సమాజంలో అందరూ ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో పని చేస్తోన్నారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications