అమరావతి కృత్రిమ ఉద్యమమే-దాడులు మా సంస్కృతి కాదు-సజ్జల కామెంట్స్...
అమరావతి : అమరావతి ఉద్యమం 1200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్న బీజేపీ నేత సత్యకుమార్ కారుపై జరిగిన దాడిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అమరావతి ఉద్యమంతో పాటు అందులో పాల్గొంటున్న పార్టీలపై నిప్పులు చెరిగారు. మార్గదర్శి చిట్స్ పై దాడులు సమంజసమేనన్నారు.
టీడీపీ అజెండాలో ప్రజలన్న పదమే లేదని వైసీపీ నేత సజ్జల తెలిపారు. , అధికారం, రాజకీయమే వారి అజెండా అన్నారు. అధికారం కోసం చంద్రబాబు తోడేళ్ల మందను ఏకం చేస్తున్నారని, చంద్రబాబు అదే నిజమని భ్రమింప జేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ సత్యకుమార్ పై దాడులు చేయించాల్సిన అవసరం తమకు లేదని సజ్జల తెలిపారు.సత్యకుమార్ దగ్గర నిరసనలు జరిగి ఉండొచ్చన్నారు. బూతులు తిడితే జనం ఊరుకుంటారా అని ప్రశ్నించారు.

అమరావతి పేరుతో జరుగుతున్నది ఉద్యమం కాదని సజ్జల తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బాబు బినామీలు నడుపుతున్నదేనన్నారు. అమరావతి కృత్రిమ ఉద్యమం అన్నది రుజువైందని సజ్జల పేర్కొన్నారు. యాత్రలు చేసి సగం దూరం తిరిగొచ్చారని అమరావతి రైతులనుద్దేశించి వ్యాఖ్యానించారు. అమరావతిలో రైతులు భూములు ఎప్పుడో అమ్ముకున్నారన్నారు. 1200 రోజులు కాదు లక్ష రోజులైనా ఉద్యమం చేసుకోవచ్చంటూ అమరావతి రైతులపై వ్యాఖ్యలు చేశారు.
మార్గదర్శి చిట్ ఫండ్స్ అనుమతులు లేకుండా నిధులు సేకరిస్తున్నారని సజ్జల తెలిపారు. ఈనాడు సంస్ధను రామోజీరావు తన స్వార్ధానికి వాడుకోవడం వల్లే ఈ మోసాలన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ పేరుతో కబ్జా చేశారు, ఏ ఆఫీసూ ఆయన సక్రమంగా కొని రిజిస్టర్ చేసుకోలేదన్నారు. గతంలో అగ్రిగోల్డ్ మీద రాతలు రాసి కేసులు పెట్టించిన రామోజీరావు ఇప్పుడు నీతులు చెబుతున్నారని సజ్జల ఆక్షేపించారు. మార్గదర్శి వ్యవహారంలో ప్రజా ప్రయోజనం ఉందని, దీనిపై చర్యలు వద్దంటే ప్రజలకు ద్రోహం చేసినట్లేనన్నారు.












Click it and Unblock the Notifications