Tammineni Sitaram: తమ్మినేనికి మరో షాక్..! హైకోర్టు కీలక తీర్పు..!
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni Sitaram)కు ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. నకిలీ పత్రాలతో భూకబ్జా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ప్రస్తుతం అరెస్టు భయంతో పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ్మినేని సీతారాం హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని ఆయన హైకోర్టును కోరారు. అయితే హైకోర్టు ఇందుకు నిరాకరించింది.
తమ్మినేని సీతారాంపై ఏపీ పోలీసులు నకిలీ పత్రాలను ఉపయోగించి సుమారు రూ.4 కోట్ల విలువైన భూమిని తన కుమారుడి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తమ్మినేనితో పాటు ఆయన కుమారుడిని అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. దీంతో విషయం గ్రహించిన వీరు.. ఇవాళ తెల్లవారుజామునే ఆముదాలవలసలోని ఇంటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

అనంతరం తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ తమ్మినేని సీతారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. కేసు క్వాష్ చేసేందుకు మాత్రం నిరాకరించింది. ఈ కేసు దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని హైకోర్టు తెలిపింది. కాబట్టి ఈ దశలో జోక్యం చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. అయితే తమ్మినేనికి మరో ఆప్షన్ మాత్రం ఇచ్చింది. అరెస్టు భయం ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. దీంతో తమ్మినేని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో తదుపరి విచారణను జులై 29కి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications