ఎక్కడికి పిలిచినా వస్తాం, ఇళ్ల మీదకు రావద్దు..!!
వైసీపీ నేతలు పోలీసు అధికారులను కలిసారు. కీలక వినతి వారి ముందుంచారు. విజయవాడలో శాప్ కార్యాలయం ముందు ధర్నా సమయంలో చోటు చేసుకున్న ఘర్షణలో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. పెద్ద సంఖ్యలో నేతల మీద కేసులు నమోదు అయ్యాయి. దీంతో, వైసీపీ నేతలు విజయవాడ సీపీ కార్యాలయంలో అధికారులను కలిసారు. తాము ఎక్కడికి పిలిచినా వస్తామని.. ఇళ్ల మీదకు రావద్దని కోరారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించాలని సూచించారు.
విజయవాడ శాప్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా..ఘర్షణలో పలువురు వైసీపీ నేతల మీద కేసులు నమోదయ్యాయి. వందల సంఖ్యలో వైసీపీ నేతల పైన కేసు నమోదు చేసారు. ఇప్పటికే పెద్ద సంఖ్య లో వైసీపీ నేతలను అరెస్ట్ చేసారు. దీంతో.. వైసీపీ నేతలు విజయవాడ సీసీ కార్యాలయంలో తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించారు. సంబంధం లేకుండా కేసులు నమోదు చేస్తున్నారని వివరించారు. డీఎస్సీ ఆందోళనలతో సంబంధం లేని వారిని అరెస్ట్ చేయటం ఏంటని పార్టీ నేతలు ప్రశ్నించారు. డీఎస్సీ నిరసన సమయంలో కొందరు పోలీసులు మితి మీరి వ్యవహరించి వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టారని పార్టీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. తమ పార్టీకి చెందిన లెక్క లేనంత మంది పైన కేసు పెట్టారని.. ఎక్కడకు రమ్మకంటే అక్కడకు వస్తామని.. ఇళ్ల మీదకు మాత్రం రావద్దని పోలీసు అధికారులను కోరారు.

వైసీపీ నేతల వ్యాఖ్యలు
విజయవాడలో మల్లాది విష్ణు ధర్నా చేస్తే దాడి చేసారని.. వారి పైన పెట్టలేదని అంబటి చెప్పారు. కోడిగుడ్లతో దాడి చేసిన వారి పైనా కేసు పెట్టలేదని చెప్పుకొచ్చారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అభాసు పాలవుతున్నారని వ్యాఖ్యానించారు. కోర్టులు అక్షింతలు వేసిన పోలీసుల తీరులో మార్పు రావటం లేదన్నారు. డీఎస్సీ నిరసనలకు సంబంధించిన కేసుల్లో సెక్షన్ 307 పెట్టారని.. అలాగే ఎస్సీ నేతల పైన ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ విఫలమైందని ఆరోపించారు. తాము ముందుగా చెప్పి నిరసనకు వస్తే టీడీపీ వాళ్లకు ఎలా అనుమతి ఇచ్చారని వైసీపీ నేతలు ప్రశ్నించారు. పొలిటికల్ ఉచ్చులో పోలీసులు పడవద్దని సూచించారు. దౌర్జన్యంతో డీఎస్సీ అంశాన్ని పక్క దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు.













Click it and Unblock the Notifications
