వైసీపీలో ఆ అభ్యర్దులకు రిలీఫ్ - సీఎం జగన్ కీలక నిర్ణయం..!!
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల జాబితా పై సీఎం జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏడు విడతలుగా ఇంఛార్జ్ లను ప్రకటించారు. మరో జాబితా విడుదలకు నిర్ణయించారు. ఇదే సమయంలో గత ఆరు విడతల్లో ప్రకటించిన జాబితాలో ఇంఛార్జ్ ల్లోనూ కొందరి మార్పులు తప్పవని తెలుస్తోంది. ఇదే సమయంలో జాబితాల్లో ప్రకటించని సీట్ల విషయంలో కొంత డైలమా కొనసాగుతున్న వేళ వైసీపీ ముఖ్య నేతలు వీటి పైన స్పష్టత ఇచ్చారు.
అభ్యర్దుల ఖరారు : ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే 31 మంది సిట్టింగ్ లకు సీటు నిరాకరించారు. పెద్ద సంఖ్యలో సీట్లలో మార్పులు చేసారు. అందులో మంత్రులు ఉన్నారు. ఈ సమయంలో మరో రెండు జాబితాల్లో ఇంఛార్జ్ ల మార్పు ఉంటుందని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 22 మంది ఎంపీలను గెలుచుకుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీల్లో మిథున్ రెడ్డి, రెడ్డప్ప, నందిగం సురేష్, డాక్టర్ గురుమూర్తి, అవినాశ్ రెడ్డిని తిరిగి కొనసాగించటం ఖాయంగా కనిపిస్తోంది. పలువురు ఎమ్మెల్యేలను ఎంపీలుగా ఈ సారి బరిలోకి దించుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా ఖరారు చేసారు. సామాజిక సమీకరణాలు.. గెలుపే ప్రామణికంగా అభ్యర్దులను ప్రకటిస్తున్నారు.

సీట్లు - లెక్కలు : ఇప్పటికే ప్రకటించిన నియోజకవర్గాల ఇంఛార్జ్ ల్లొనూ కొందరి మార్పులు తప్పవని చెబుతున్నారు. మంగళగిరిలో గంజి చిరంజీవి మార్పు అవసరమా కాదా అనే అంశం పైన పార్టీ లోతుగా అధ్యయనం చేస్తోంది. రేపల్లె నుంచి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు తిరిగి సీటు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఇదే విధంగా మరో అయిదు నియోజకవర్గాల్లో మార్పులు అవసరమని చెబుతున్నారు. వీటి పైన తాజా సర్వే నివేదికల ఆధారంగా సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. కర్నూలు, విజయనగరం, అనకాపల్లి ఎంపీల ఖరారు విషయంలో సీఎం జగన్ ఇప్పుడు విడుదల చేసే జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. ఒంగోలు, నెల్లూరులో మారుతున్న సమీకరణాల ఆధారంగా ఎంపీల ఖరారు విషయంలో జగన్ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.

ఛాన్స్ దక్కేదెవరికి : ఇక..ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి పేరు ఖాయమని చెబుతున్నా ఇంకా ప్రకటించలేదు. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి పేరు ఖాయం చేసినా తాజాగా ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారనే వార్తలు వచ్చాయి. దీంతో, వేమిరెడ్డితో మంతనాలు చేస్తూనే..ప్రత్యామ్యాయ అభ్యర్దుల పైన కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే ఆదాల ప్రభాకర్ రెడ్డిని తిరిగి ఎంపీగా పోటీ చేయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రకటించని నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులు లేనట్లేనని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. ఒక, ఒకటి రెండు రోజుల్లోనే అభ్యర్దుల కసరత్తు పూర్తి చేసి ఇక పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభిచాలని ముఖ్యమంత్రి జగన్ ఆలోచనగా తెలుస్తోంది. దీంతో, మలి జాబితా పైన పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications