పరారీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్?
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ అతిథి గృహంలో ఉన్న పిన్నెల్లిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 13వ తేదీన మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయిగేటు గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ బూత్ లో ఉన్న ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితోపాటు అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
లుక్ ఔట్ నోటీసులు
ప్రస్తుతం పరారీలో ఉన్న ఎమ్మెల్యే కోసం పోలీసులు ఉదయం నుండి విస్తృతంగా గాలిస్తున్నారు. విదేశాలకు పారిపోయేందుకు అవకాశం ఉందని, అందుకు ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు రావడంతో ఎమ్మెల్యేపై పోలీసులు లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే పిన్నెల్లి తలదాచుకున్నట్లు సమాచారం వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ పై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

పోలీసుల గాలింపు
ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. వాస్తవానికి పిన్నెల్లి ఎక్కడున్నారనేది వారికి తెలుసని, అసలు పారిపోవడానికి సహకరించింది కూడా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పోలీసులేనని ఆరోపణలు వచ్చాయి. ఈవీఎం ధ్వంసం కేసులో గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారంటూ కేసు నమోదు చేశారు. చివరకు ఈసీ రంగంలోకి దిగడంతో పిన్నెల్లి కోసం గాలింపు చర్యలు చేపట్టడం తప్పలేదు. ఎస్పీ మల్లికా గార్గ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు హైదరాబాద్ చేరుకొని ఎమ్మెల్యే కోసం గాలించాయి. సంగారెడ్డివైపు వెళ్లారన్న వార్తలతో అప్రమత్తమైన పోలీసులు అదే జిల్లాకు చెందిన కంది గ్రామం వద్ద కారును స్వాధీనం చేసుకొని డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతోనే పిన్నెల్లి కారు వదిలి పరారైనట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications