లాక్ డౌన్ వేళ వైసీపీ ఎమ్మెల్యే హల్‌చల్.. 5 కార్లలో కర్ణాటక నుంచి ఆంధ్రాకు..
కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరు నుంచి ఐదు ఇన్నోవా కార్లలో 39 మంది బంధువులతో ఆంధ్రా బయలుదేరిన ఆయన్ను ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులోని చీకలబైలు చెక్ పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో రాష్ట్రంలోకి రాకపోకలను అనుమతించట్లేదని పోలీసులు చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆయన.. వారిని లెక్క చేయకుండా తిరుపతికి చేరుకున్నట్టు సమాచారం. అయితే తిరుపతి చెక్ పోస్ట్ వద్ద కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఐదు కార్లు అక్కడే నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చేవరకు వేచి చూడాలని పోలీసులు కోరినట్టు తెలుస్తోంది.

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడంతో ఇతర రాష్ట్రాల నుంచి ఎవరినీ అనుమతించడం లేదు. ఒకవేళ ఎవరైనా వచ్చినా 14 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉండాల్సిందేనని ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల తెలంగాణలో క్వారెంటైన్ పూర్తి చేసుకుని వెళ్లినవారిని సైతం మళ్లీ క్వారెంటైన్‌లో ఉండాల్సిందేనని ఆదేశించింది. తాజాగా స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే పొరుగు రాష్ట్రం నుంచి బంధువులను వెంటపెట్టుకుని రావడంతో.. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 502 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరులో 118, కర్నూలు జిల్లాలో 97, నెల్లూరు 56, ప్రకాశం 42,కృష్ణా జిల్లాలో 45 , ప్రకాశం 42 ,కడపలో 33 కేసులు నమోదయ్యాయి. బుధవారం(ఏప్రిల్ 15)న కొత్తగా మరో 19 కేసులు నమోదయ్యాయి. ఇందులో పశ్చిమగోదావరిలో 8, కర్నూలులో 6, గుంటూరులో 4, కృష్ణా జిల్లాలో ఒక్క కేసు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications