'టీడీపీ నేతలు పేదల రక్తపు కూడు తింటున్నారు', 'బాబు వచ్చాక బెజవాడలో క్రైమ్ రేటు పెరిగింది'
విజయవాడ: బెడవాడ 'కాల్ మనీ' వ్యవహారం రాజకీయ రంగు పలుముకుంది. టీడీపీ నేతలు పేదల రక్తపు కూడు తింటున్నారని వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. విజయవాడలోని కాల్ మనీ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్యేల ప్రమేయం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కొడాలి నాని హైదరాబాద్‌లో శనివారం దీనిపై స్పందించారు. ఈ కేసు దర్యాప్తులో ఎవరి ఒత్తిళ్లకు లొంగొద్దని ఆయన పోలీసులకు హితవు పలికారు. ఈ కేసులో ఎంతటి వారున్నా ఉపేక్షించవద్దని ఆయన సీఎం చంద్రబాబుకు సూచించారు.
చంద్రబాబు ఎదుటి వారికి నీతులు చెబుతారు కానీ, ఆయన మాత్రం పాటించరని ఈ సందర్భంగా విమర్శించారు. కాల్ మనీ వ్యవహారం సొంత పార్టీ నేతల వ్యవహారమని, దానిపై బాబు ఎలా వ్యవహరిస్తారో చూడాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న అధికార పార్టీ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు.

ఈ కాల్‌మనీ దందాలో ప్రధాన సభ్యుడిగా పోలీసులు అనుమానిస్తున్న యలమంచిలి రాము అనే వ్యక్తి గతంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ కాల్‌మనీ ముఠాలో ప్రధాన సభ్యుడైన యలమంచిలి రాము అనే వ్యక్తి గతంలో కూడా హనుమాన్ జంక్షన్‌లో రూ. 60 ఐపీ పెట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ కేసులో యలమంచిలి రాము, భవానీ శంకర్, చెన్నుపాటి నివాస్, విద్యుత్ శాఖ డీఈ సత్యానంద్, టీడీపీ నేతలు వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, దూడల రాజేష్‌పై కేసులు నమోదయ్యాయి. వీరందరిపై.... ఐపీసీ సెక్షన్ 420, 376, 354a(1)(2), 384, 506, రెడ్‌విత్ 34, 120(బీ) కింద విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రబాబు వచ్చాక బెజవాడలో క్రైమ్ రేటు పెరిగింది: వాసిరెడ్డి పద్మ
కాల్‌మనీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాల్‌మనీ, సెక్స్ రాకెట్‌లో ఉన్న వారిని తప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు.
ఆయన కాపాడతారనే నమ్మకంతోనే తెలుగు తమ్ముళ్లు పేట్రేగి పోతున్నారన్నారు. విజయవాడకు చంద్రబాబు మకాం మార్చిన తర్వాతే అక్కడ నేరాలు బాగా పెరికాయని ఆమె తెలిపారు. విజయవాడను నేర రాజధానిగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.












Click it and Unblock the Notifications