బాబుతో చేయి కలిపిన ఎమ్మెల్యే: జగన్‌కు మరో షాక్?, సైకిలెక్కిన నెహ్రూ
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగలనుందా? అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పదిమందికి పైగా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేరడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మరో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చేతులు కలపడం చర్చనీయాంశమవుతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. చిత్తూరు జిల్లాలో మదనపల్లికి వచ్చిన చంద్రబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పైన గెలుపొందిన పలువురు నేతలు టిడిపిలోకి క్యూ కడుతున్న నేపథ్యంలో... చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవడం, ఆయనతో చేయి కలపడం చర్చనీయాంశమవుతోంది. అయితే, నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇదే సహజమేనని చెబుతున్నారు.

సైకిల్ ఎక్కిన నెహ్రూ
టిడిపిలోకి చేరే వైసిపి ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా తూర్పు గోదావరి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సైకిలెక్కారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళావెంకట్రావుతో కలిసి జ్యోతుల నెహ్రూ విజయవాడలోని ఏ1కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు.
పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నెహ్రూతో పాటు 36మంది సర్పంచులు, 43మంది ఎంపీటీసీ సభ్యులు, ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు పార్టీలో చేరినవారిలో ఉన్నారు.
భూములు తీసుకోవడంపై రాజధాని ప్రాంత రైతుల ఫిర్యాదు
అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిన భూముల వ్యవహారంపై మరోమారు సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఆందోళన మొదలైంది. తమకు తెలియకుండానే తమ భూములు లాక్కుంటున్నారని రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక రైతులు సీఆర్డీఏ అధికారులతో సోమవారం వాగ్వాదానికి దిగారు.
రాజధాని నిర్మాణానికి తమ భూములు ఇవ్వకున్నా వాటిలో అధికారులు సర్వే చేస్తున్నారని తెలుసుకున్న రైతులు విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌తో వారు వాగ్వాదానికి దిగారు.
రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌కు తమ భూములు ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో కోర్టు కూడా తమకే అనుకూలంగా తీర్పు ఇచ్చిందని చెప్పారు. రాజధానికి భూములివ్వకున్నా, తమకు తెలియకుండానే తమ భూములను లాక్కునే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications