నామినేషన్ల గడువు పెంచండి - హైకోర్టులో వైసీపీ పిటీషన్..!!
స్థానిక ఎన్నికల వేళ ఊహించని రాజకీయం చోటు చేసుకుంటోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల గడువు ఈ రోజుతో పూర్తి కానుంది. ఈ సమయంలో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. తమ అభ్యర్ధులకు నామినేషన్లు దాఖలు చేయనీయకుండా అడ్డుకుంటున్నారని... 48 గంటలు గడువు పెంచాలని కోరుతోంది. హైకోర్టు విచారణకు అంగీకరించింది. అటు నామినేషన్ల దాఖలు పైన ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దీంతో, ఈ వ్యవహారం ఉత్కంఠగా మారుతోంది.
వైసీపీ మరోసారి కోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ రోజుతో ముగుస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల గడువు పెంచాలని కోరుతోంది. ఈ మేరకు చోటు చేసుకున్న ఘటనలను పిటీషన్ లో పేర్కొంది. హైకోర్టు విచారణకు స్వీకరించింది. కాగా.. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల పైన వైసీపీ సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం కొన్ని కార్పోరేషన్లలో నామినేషన్ల గడువు పెంచింది.

పోలింగ్ తేదీలోనూ మార్పు చేసింది. ఇక, ఇప్పుడు జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ తమ అభ్యర్ధులను నామినేషన్ దాఖలు చేయకుండా ముందస్తుగానే హౌస్ అరెస్టులు చేస్తున్నారని.. అభ్యర్ధులను అడ్డగిస్తున్నార ని వైసీపీ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొంది.
నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్ధుల కోసం ప్రత్యేకంగా కలెక్టర్ కార్యాలయాల్లో అవకాశం కల్పించాలని కోర్టును కోరుతోంది. జెడ్పీటీసీ.. ఎంపీటీసీ నామినేషన్ల గడువు మరో 48 గంటలు పొడిగించాలని అభ్యర్ధించింది. పలు చోట్ల నామినేషన్ పత్రాలను చించి వేస్తున్నారని.. భద్రత కల్పించాలని కోరింది. ముందస్తు అరెస్టులు చేసిన అభ్యర్ధులను విడుదల చేసి.. వారికి నామినేషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది.
అటు ఎన్నికల సంఘం నామినేషన్లు వేయలేని వారికి ఈ సాయంత్రం 6 గంటల వరకు సమయం కేటాయించింది. దీంతో, అటు కోర్టు లో విచారణ.. ఇటు ఎన్నికల సంఘం నిర్ణయాల వేళ ఎలాంటి నిర్ణయాలు వస్తాయనేది ఉత్కంఠ గా మారుతోంది. అదే విధంగా 11 మున్సిపాల్టీల్లో తిరిగి నామినేషన్ల వ్యవహారం పైన సుప్రీంకోర్టు లో తమ వాదనలు వినిపించేందుకు వైసీపీ మరోసారి ప్రయత్నాలు చేస్తోంది.













Click it and Unblock the Notifications
