ఒరిజినల్ వీడియో ఇస్తా: ఆ దమ్ముందా?: టీడీపీకి గోరంట్ల మాధవ్ ఓపెన్ ఛాలెంజ్
కర్నూలు: రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి కారణమైన వివాదాస్పదమైన అంశం- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్స్. దీనిపై చెలరేగిన వివాదాలు ఇప్పటికీ తగ్గట్లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిరోజూ స్పందిస్తూనే ఉన్నారు. ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగుతూనే ఉన్నారు. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్‌ను కేంద్రబిందువుగా చేసుకున్నారు.

పోలీసుల ప్రకటనతో..
ఈ వీడియోను మార్ఫింగ్ చేశారంటూ అనంతపురం జిల్లా పోలీసులు ప్రకటించినప్పటికీ.. టీడీపీ నాయకులు మాత్రం వెనుకంజ వేయట్లేదు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తోన్నారు. గోరంట్ల మాధవ్ వీడియో నిజమైనదేనంటూ తాజాగా అమెరికా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కూడా ధృవీకరించిందనే వాదనను టీడీపీ నాయకులు తెరమీదికి తీసుకొచ్చారు. దీనిపైనా గోరంట్ల మాధవ్ స్పందించారు.

అనంతకు మాధవ్..
ఈ పరిణామాల మధ్య- గోరంట్ల మాధవ్ ఇవ్వాళ అనంతపురం జిల్లాకు రానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన సమయంలో ఈ న్యూడ్ వీడియో కాల్స్ వ్యవహారం తెరమీదికి వచ్చింది. దీనితో ఆయన అక్కడి నుంచే స్పందించారు. అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి విలేకరుల సమావేశం తరువాత గోరంట్ల మాధవ్ మరింత ఘాటుగా తెలుగుదేశం పార్టీ నేతలు, వారికి అనుకూలంగా ముద్రపడిన మీడియా పెద్దలపై రియాక్ట్ అయ్యారు.

కర్నూలులో ఘన స్వాగతం..
ఈ ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరిన గోరంట్ల మాధవ్ కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. రాయలసీమ జిల్లాలకు చెందిన పలువురు కురుబ సంఘాల ప్రతినిధులు కలుసుకున్నారు. స్వాగతం పలికారు. నైతిక మద్దతును ప్రకటించారు. గోరంట్ల మాధవ్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఆయనకు అనుకూలంగా, టీడీపీ నేతల వైఖరికి నిరసనగా ఆయా సంఘాల ప్రతినిధులు అనంతపురం, హిందూపురంలల్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించిన విషయం తెలిసిందే.

టీడీపీకి ఆ దమ్ముందా?
కర్నూలులో గోరంట్ల మాధవ్ కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడి ఆడియోను అమెరికా ల్యాబ్‌లో పరీక్షించే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. నోటుకు ఓటు ఆడియోను నకిలీదని నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. బీసీలను అణగదొక్కాలనే కుట్రతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తోన్నారని ఆరోపించారు. బీసీ నాయకులను టీడీపీలో చోటు లేదని, చులకనగా చూస్తారని అన్నారు. గంజి చిరంజీవి రాజీనామా ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు.

ఒరిజినల్ వీడియో..
ఒరిజినల్ వీడియో తన వద్దే ఉందని, పోలీసులు అడిగితే ఇస్తానని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. నకిలీ వీడియోను అడ్డంగా పెట్టుకుని టీడీపీ డ్రామాలాడుతోందని, క్రమంగా డ్రామా పార్టీగా మారిపోతోందని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోనే ఒరిజినల్‌గా అమెరికా ల్యాబొరేటరి తేల్చిందంటూ కొత్త డ్రామా మొదలు పెట్టిందని విమర్శించారు. చంద్రబాబు బ్రీఫ్డ్‌మి ఆడియోను అదే ల్యాబొరేటరీకి పంపించగలరా? అని సవాల్ చేశారు.
Recommended Video


తీర్పులు.. ఉత్తర్వులు వారివే..
న్యూడ్ వీడియో కాల్ విషయంలో చంద్రబాబు, ఆయన అనుచరులు, తెలుగు డ్రామా పార్టీ నాయకులు తమకు తాముగా తీర్పులు ఇస్తోన్నారని, ఉత్తర్వులను కూడా జారీ చేస్తోన్నారని ధ్వజమెత్తారు. పోలీస్ వ్యవస్థను కూడా విశ్వసించే స్థితిలో టీడీపీ నాయకులు లేరని ఆరోపించారు. చంద్రబాబు, ఆయన అనుచరుల డ్రామాలను ప్రజలు గమనిస్తోన్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ 23 సీట్లు కూడా దక్కబోవని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications