కాకినాడ పోర్టుపై అసలు నిజాలివే-బాబు, లోకేష్ కన్నా పవనే బెటర్-సాయిరెడ్డి కామెంట్స్..!
కాకినాడ పోర్టు యాజమాన్యాన్ని తమ బంధువులకు ఇప్పించుకునేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనను కేసుల పేరుతో బెదిరించి షేర్లు తక్కువ రేట్లకు లాక్కున్నారంటూ మాజీ ఛైర్మన్ కేవీ రావు తాజాగా సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఐడీ విజయసాయిరెడ్డితో పాటు ఇతర నిందితులు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. దీనిపై ఇవాళ విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఘాటుగా స్పందించారు.
కాకినాడ పోర్టును ఏడీబీ నిధులతో ఏర్పాటు చేశారని, ప్రభుత్వ రంగంలోని పోర్టును చంద్రబాబు ప్రైవేట్ పరం చేశారని సాయిరెడ్డి తెలిపారు. మలేషియా ప్రధానమంత్రి మహాతిర్ మహమ్మద్ తనయుడు కొంటున్నారని చంద్రబాబు అప్పట్లో చెప్పారని, చివరికి ఆ ముసుగులో కేవీ రావుకు కాకినాడ పోర్టు కట్టబెట్టారన్నారు. కేవీ రావుని దొడ్డిదారిన సిఎండి స్థానంలో కూర్చోబెట్టారని వెల్లడించారు. కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచి దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

చంద్రబాబు జేబు సంస్థ సీఐడీ ద్వారా కాకుండా సీబీఐ ద్వారా ఈ దర్యాప్తు జరపాలని సాయిరెడ్డి కోరారు. జగన్మోహన్ రెడ్డిపై కక్ష తీర్చుకోవాలని పగతో చంద్రబాబు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో 58 రోజులపాటు చంద్రబాబు జైల్లో ఉన్నారని, ఆయనో క్రిమినల్ అని సాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సంక్షేమ పథకాల అమలు చేయకుండా ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తనకు అన్యాయం జరిగితే నాలుగున్నర ఏళ్ల నుంచి కెవి రావు ఏం చేస్తున్నారని సాయిరెడ్డి ప్రశ్నించారు.
చంద్రబాబు రాగానే ఇప్పుడు ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఏమిటని సాయిరెడ్డి ప్రశ్నించారు. కేవీ రావు చంద్రబాబు చెంచా అన్నారు. మరో నాలుగున్నర ఏళ్లు చంద్రబాబు అధికారంలో ఉంటాడని, మళ్ళీ తాము అధికారంలోకి వస్తే చంద్రబాబు జైలు పాలు కావడం తథ్యమని సాయిరెడ్డి తెలిపారు. సింగపూర్ లో ఉండి ప్రపంచవ్యాప్తంగా బ్రోకర్ పనులు చేసే వ్యక్తి కె.వి.రావు అన్నారు. నెగోషియేషన్స్ ద్వారానే వాల్యుయేషన్ జరుగుతుందని కాకినాడ పోర్టుపై వ్యాఖ్యానించారు.
మే 2020 లో కేవీ రావుకు తాను ఫోన్ చేశానని , కాకినాడ పోర్టుపై విక్రాంత్ తో మాట్లాడానని చెప్పడానికి ఆధారాలున్నాయా అని సాయిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకి పాలన చేతకాదని, నారా లోకేష్ కూడా అడ్మినిస్ట్రేటర్ కాదని విమర్శలు గుప్పించారు. పనికిరాని మంత్రి నారా లోకేష్ అని, తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
కెవి.రావు పెద్ద బ్రోకర్ అని 2018లో పవన్ కళ్యాణ్ చెప్పారని, ఆయనకు పోర్టును తిరిగి కట్టబట్టే ప్రయత్నంలో భాగమే ఈ కేసుల కుట్ర అన్నారు.
తనపై లుక్ అవుట్ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని, తాను విదేశాలకు వెళ్లాలంటే సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వాల్సిందేనని గుర్తుచేశారు. ఏ మాత్రం ఇంగితం లేకుండా చంద్రబాబు లుక్ అవుట్ నోటీస్ ఇచ్చాడన్నారు.తమ ఇమేజ్ దెబ్బ తీసే కుట్ర చేస్తున్నారని, చంద్రబాబుపైన పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు, లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్ అవుతారన్నారు.












Click it and Unblock the Notifications