టీడీపీ కొత్త నినాదం ఇదీ: బయటపెట్టిన సాయిరెడ్డి, అంబటి: ఎన్టీఆర్-చంద్రబాబు జమానాలో ఇలా
తిరుపతి: తిరుపతి లోక్‌సభ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ముంగిట్లో తెలుగుదేశం పార్టీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు టీడీపీని రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టినట్టయింది. వెంకటేశ్వర రావు అనే టీడీపీ నాయకుడితో ఆయన సాగించిన సంభాషణకు సంబంధించిన వీడియోలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అయాచిత అస్త్రంలా మారింది. అచ్చెన్న చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ వైసీపీ నేతలు ఘాటు విమర్శలు సంధిస్తున్నారు.
సెటైర్లతో చెలరేగిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు హయాం నాటి పరిస్థితులను ఇఫ్పుడు బేరీజు వేస్తున్నారు. ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ.. చంద్రబాబు హయాంలో అత్యంత పతనావస్థకు చేరుకుందని చురకలు అంటిస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో నేషనల్ ఫ్రంట్‌గా ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేస్తున్నారు.

టీడీపీ అనేది ఒక సామాజిక వర్గానికి, ఒక ప్రాంత ప్రయోజనాల కోసమే పరిమితమైందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్టీ రామారావు హయాంలో తెలుగుదేశం పార్టీ నినాదం సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు కాగా.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి హయాంలో ఆ పార్టీ నినాదం పార్టీ లేదు.. బొక్కా లేదు అని రూపాంతరం చెందందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి కిందట ఓ ట్వీట్ చేశారు.
టీడీపీ ఎలాంటి దారుణ పరిస్థితుల్లో ఉందనే విషయాన్ని స్వయంగా అచ్చెన్నాయుడి మాటల్లోనే తేలిపోయిందని చెప్పారు. ఇదే విషయంపై వైసీపీకి చెందిన సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా స్పందించారు. పార్టీ లేదు.. బొక్కా లేదు అనేది వాస్తవమని తేల్చి చెప్పారు. తమ్ముళ్లు తలోదారి చూసుకోవడమే మిగిలి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీలో మిగిలి ఉన్న నాయకులకు తలోదారి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.












Click it and Unblock the Notifications