YS Viveka Case: సీబీఐ ముందుకు అవినాష్ - గుట్టు విప్పుతారా..!!
వివేకా హత్య కేసు విచారణలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. హైకోర్టు అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. సీబీఐ విచారణకు సహకరించాలని అవినాష్ కు సూచించింది. దీంతో, ఇప్పుడు అవినాష్ సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అవినాష్ తో పాటుగా ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని కలిపి సీబీఐ విచారించనుంది.
విచారణకు హాజరైన అవినాష్:వివేకా హత్య కేసులో మరోసారి సీబీఐ ముందు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. రెండు రోజుల క్రితమే సీబీఐ అవినాష్ ను విచారించాల్సి ఉంది. సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ విచారణ సమయంలో అవినాష్ ఈ హత్య వెనుక అసలు కారణాలు వేరని పలు అంశాలను కోర్టు ముందు ఉంచారు. తనతో పాటుగా తన తండ్రి పేర్లను రాజకీయ కుట్రలో భాగంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో ఆర్దిక, అక్రమ సంబంధాల వ్యవహారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఇంప్లీడ్ అయిన సునీత తరపు న్యాయవాది కూడా దస్తగిరి తన స్టేట్ మెంట్ లో అవినాష్ పేరు చెప్పిన అంశాన్ని కోర్టులో ప్రస్తావించారు. వాదనలు విన్న కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

హత్య వెనుక కారణాలపై :ఈ నెల 25వ తేదీ వరకు సీబీఐ విచారణకు హాజరు కావాలని అవినాష్ కు సూచించింది. అవినాష్ కు లిఖిత పూర్వకంగా ప్రశ్నలు ఇచ్చి సమాధానం తీసుకోవాలని నిర్దేశించింది. విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో అవినాష్ విచారణ ప్రారంభమైంది. కోర్టు నుంచి కస్టడీకి అనుమతి పొందటంతో వైఎస్ భాస్కర రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా కలిపి సీబీఐ విచారణ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు అవినాష్ తమకు విచారణలో సహకరించటం లేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఇప్పుడు అవినాష్ విచారణ లో సీబీఐ మరింత కీలక సమాచారం సేకరించే అవకాశం కనిపిస్తోంది.
విచారణ రికార్డింగ్ :కోర్టులో వాదనల్లో భాగంగా సీబీఐ అసలు పరిగణలోకి తీసుకోని అంశాలను అవినాష్ ప్రస్తావించారు. ఇప్పుడు సీబీఐ వాటి గురించి అవినాష్ నుంచి సమాచారం రాబడుతుదా, అసలు వాటిని పూర్తిగా విస్మరిస్తుందా అనేది ఈ కేసు విచారణలో ఇప్పుడు కీలకం కానుంది. ఈ నెలాఖరులోగా సుప్రీం ఆదేశాల మేరకు కేసు విచారణ పూర్తి చేయాల్సి ఉంది. హత్య ఘటనలో ఆధారాలను మాయం చేయటంతో పాటుగా అవినాష్ ప్రమేమం ఉందని సీబీఐ వాదిస్తోంది. ఈ క్రమంలో ఇన్ని ట్విస్టుల నడుమ ఎంపీ అవినాష్ విచారణ కీలకంగా మారుతోంది. హత్య తరువాత చోటు చేసుకున్న పరిణామాల పైన ఈ సారి విచారణలో ఆరా తీసే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications