MLAలుగా పోటీకి సిద్ధమైన MPలు?
రానున్న ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ప్రత్యర్థులకు అంతుపట్టని రీతిలో వ్యూహాలను రచిస్తున్నారు. అదే క్రమంలో పార్టీలో ఉండే వ్యతిరేకతను కూడా క్రమేణా తగ్గించుకుంటూ రావాలని నిర్ణయించారు. తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు చెక్ పెట్టబోతున్నారు.

విశాఖ తూర్పు నుంచి ఎంపీ ఎంవీవీ
వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళితే కచ్చితంగా ఓటమిపాలవుతామని, అందుకే కొందరు సిట్టింగ్ లకు సీట్లు ఇచ్చే విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొంతమందికి పరోక్షంగా సీట్లు లేవని చెప్పేస్తూ వారి స్థానాల్లో కొత్తవారిని రంగంలోకి దించాలని చూస్తున్నారు. ఈ కోవలోనే కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీచేయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను విశాఖపట్నం తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయించే యోచనను అధిష్టానం చేస్తోంది.

ఎమ్మెల్యే పీఏ అక్రమాలపై గగ్గోలు
అలాగే కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం నుంచి పోటీచేయించాలని చూస్తున్నారు. ముద్రగడ పద్మనాభం ఒకవేళ పార్టీలోకి వస్తే పిఠాపురం సీటు ఆయనకు కేటాయిస్తారు. ఇక్కడి ఓటర్లలో 80 శాతం ఓటర్లు కాపు సామాజికవర్గానికి చెందినవారే ఉన్నారు. అందుకే ఈ నియోజకవర్గానికి డిమాండ్ పెరుగుతోంది.
ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబు పీఏ చక్రి చేస్తున్న అక్రమాలపై అధిష్టానానికి ఫిర్యాదు అందడంతో అతన్ని దూరంగా ఉంచాలని ఆదేశాలు వెళ్లాయి. అతని ఆగడాలపై సొంత పార్టీవారే గగ్గోలు పెడుతున్నారు.

దొరబాబు బదులు వంగా గీత?
దొరబాబుపై వ్యతిరేకత ఉండటంతో అతనికి సీటు రావడం కష్టమని, వంగా గీతే పోటీచేయొచ్చంటున్నారు. 2009లో గీత ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసి గెలుపొందిన అనుభవం ఉండటంతో ఆమెకే దాదాపు ఖారారవవచ్చని భావిస్తున్నారు. తెలుగుదేశం-జనసేన పొత్తు కుదిరితే పిఠాపురంలో వైసీపీ గెలుపొందడం కష్టమని అంచనాలు వేస్తున్నారు.
బాపట్ల ఎంపీగా ఉన్న నందిగం సురేష్ కూడా ఎమ్మెల్యేగా పోటీచేయడానికి నియోజకవర్గాన్ని వెతుక్కుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తాడికొండ, వేమూరు, ప్రత్తిపాడు రిజర్వుడు నియోజకవర్గాలుగా ఉన్నాయి.
వీరితోపాటు మరికొందరు ఎంపీలు కూడా ఎమ్మెల్యేలుగా పోటీచేయడానికి నియోజకవర్గాలను వెతికే పనిలో ఉన్నారు. వీరందరికీ ఎమ్మెల్యేలుగా టికెట్లిస్తారా? కొందరిని తిరిగి ఎంపీలుగా పోటీచేయిస్తారా? అనేది తేలాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications