కోటి అరవై లక్షల కుటుంబాలు -మెగా సర్వే: సీఎం జగన్ కు మద్దతు ఎంత..!!
రాష్ట్రంలో మెగా సర్వే. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి కోటి అరవై లక్షల కుటుంబాలు. 5 కోట్ల మంది ప్రజలు. ఇందులో సీఎం జగన్ కు మద్దతుగా నిలుస్తున్నవారి సంఖ్య ఎంత. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 46 నెలల కాలంలో రూ 2.05 లక్షల కోట్లు సీఎం జగన్ సంక్షేమ పథకాల కింద అందించారు. పథకాల లబ్ది దారులంతా తమ వైపే ఉన్నారని వైసీపీ విశ్వసిస్తోంది. వారే తన సైనికులుగా చెబుతోంది. త పథకాలు కొనసాగాలంటే జగన్ మరోసారి అధికారంలోకి రావాలని నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో అసలు వీరిలో జగన్ కు మద్దతుగా నిలుస్తున్నది ఎంత మంది.
రేపటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ: ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా ఏడు లక్షల మంది పార్టీ కార్యకర్తలు..గృహ సారధులు..కన్వీనర్లు కలిసి రాష్ట్రంలోని కోటి 60 లక్షల కుటుంబాలను కలవనున్నారు. అంటే దాదాపుగా అయిదు కోట్ల మందితో రేపు 7వ తేదీ నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ప్రతీ ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి సీఎం నేరుగా ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేసారు. ఇందులో గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి పోలికకు సంబంధించిన అంశాలను వివరిస్తూ కరపత్రం ఇవ్వనున్నారు.

ప్రజల్లో ప్రభుత్వంపై అభిప్రాయం: ప్రజల వద్దకు వెళ్లి వారి నుంచి ప్రభుత్వం పైన అభిప్రాయ సేకరణ చేస్తారు. నాలుగేళ్ల కాలంగా అందిస్తున్న సంక్షేమం గురించి వివరిస్తారు. వెళ్లిన ఇంటికి అందిన ప్రయోజనాల గురించి చెబుతారు. గతంలో పాలన ఎలా ఉందీ..ఇప్పుడు ఏ విధంగా ఉన్నదనే అంశం పైన వారితో అభిప్రాయాలు పంచుకుంటారు. జగన్ ప్రభుత్వంలో మంచి జరిగితే తమకు మద్దతుగా నిలవమని కోరుతారు. ఐదు ప్రశ్నలు వేస్తారు. దీనిలోనే జగన్ పట్ల ప్రజా మద్దతు తెలుస్తుంది . మద్దతుగా నిలిచేవారు 8296082960 ఫోన్ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వమని అడుగుతారు. మిస్డ్ కాల్ ఇచ్చిన వారికి జగన్ వాయిస్ తో ధన్యవాదాల మెసేజ్ వెళుతుంది. దీని ద్వారా ఎన్ని కుటుంబాల నుంచి పాలనకు మద్దతు ఉందనే అంశంపైన స్పష్టత వస్తుంది.

ఇంటికి స్టిక్కర్: జగన్ పాలనకు మద్దతుగా నిలిచిన వారికి అభ్యంతరం లేకపోతే వారి ఇంటికి జగన్ స్టిక్కర్ అంటిస్తారు. ఈ తరహాలో ఈ నాలుగేళ్లలో ప్రభుత్వ సాయం అందితేనే తనకు ఓటేయమని జగన్ అంటున్నారు. ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల చెప్పుకొచ్చారు. పూర్తిగా పాదర్శకంగా ఈ కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేసారు. దీని ద్వారా ప్రజల నుంచి వచ్చే ఆదరణ - స్పందనకు అనుగుణంగా ఎన్నికలకు సిద్దం కావాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఎక్కడైనా అభిప్రాయ సేకరణలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయితే, వారిని కూడా తమకు అనుకూలంగా మలచుకోవటానికి ఈ కార్యక్రమం ఒక అవకాశంగా వైసీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఈ సర్వే పైన రాజకీయంగా ఉత్కంఠ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications